కిడ్నీ చికిత్సకు పోతే మెడికవర్‌లో కాటికి యువ న్యాయవాది!

 
కిడ్నీలో రాళ్లు తీయించుకోవడం కోసం కార్పొరేట్‌ హాస్పిటల్‌లో చేరిన ఓ యువ న్యాయవాది ప్రాణమే పోయింది. మూత్రపిండంలో రాయిని తీస్తే మెదడులో రక్తస్రావమై చనిపోయిందని వైద్యులు చెప్పడంతో బంధువులు, తోటి అడ్వకేట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే యువతి చనిపోయిందని, హాస్పిటల్‌ ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. 
 
బంధువులు, న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరికి చెందిన సుధీర్‌కుమార్‌- గాయత్రీదేవి కూతురు ఐశ్వర్య (28) జూనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. 40 రోజుల కిత్రమే పట్టాభి తో వివాహం జరిగింది. ఇటీవల కడుపులో నొప్పి రావడంతో వైద్యుల దగ్గర చూపించుకోగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు. దానితో ఆపరేషన్‌ కోసం ఈ నెల 7న సికింద్రాబాద్‌ మెడికవర్‌ హాస్పిటల్‌లో చేరింది.  అదే రోజున ఆమెకు శస్త్రచికిత్స చేశారు.
 
2 ఎంఎం సైజు రాళ్లు ఉన్న ఆమెకు అవసరం లేకున్నా ఆపరేషన్‌ చేశారని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అపస్మారక స్థితికి చేరుకున్నదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమెను బ్రెయిన్‌ డెడ్‌కు గురైందని చెప్తున్నారని హాస్పిటల్‌ ఎదుట ఆదోళనకు దిగారు. పెద్ద ఎత్తున న్యాయవాదులు తరలివచ్చి సదరు డాక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని, హాస్పిటల్‌ను సీజ్‌ చేయాలని నినాదాలు చేశారు. 
 

ఐశ్వర్య చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.7 లక్షలు ఖర్చు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గోపాలపురం, మార్కెట్‌, తుకారాం గేట్‌, హాస్పిటల్‌ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి బంధువులకు నచ్చజెప్పారు.ఐశ్వర్య ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్‌ మెడికవర్‌ హాస్పిటల్‌ యాజమాన్యం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ‘తీవ్ర కడుపునొప్పితో అక్టోబర్‌ 7న హాస్పిటల్‌లో చేరిన టీ ఐశ్వర్య (28)కు కిడ్నీ నుంచి మూత్రం ప్రవహించే మార్గంలో అడ్డంకిగా ఉన్న రాయిని ఆపరేషన్‌ ద్వారా తొలగించాం. రక్తంలో ప్లేట్‌లెట్లు, తెల్ల రక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో శరీరంలో వాపు రావడంతో ఎంఐసీయూకు తరలించి చికిత్స అందించాం. సీటీ స్కాన్‌లో మెదడులో రక్త స్రావమైనట్టు గుర్తించాం. ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మందులతో చికిత్స అందించాం’ అని పేర్కొన్నది.

About The Author