హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రతిపాదించిన ఎల్బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి, హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్, రోప్‌వేలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు సహా అనేక ప్రతిపాదనలపై కూడా చర్చించారు.
జాతీయ రహదారి ఎన్‌హెచ్-167కెపై నిర్మించనున్న ఈ బ్రిడ్జికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు కేంద్రమంత్రి ఆమోదం తెలిపినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే 2 రాష్ట్రాల మధ్య రాకపోకలకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు, ప్రాంతీయ రవాణా, పర్యాటక రంగాలకు ఊతం లభించే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి ఎన్‌హెచ్-765పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి సూచించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. డీపీఆర్‌లో ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ వ్యయం, అవసరమైన భూసేకరణ, సాంకేతిక అంశాలు వంటి వివరాలను పరిశీలించనున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టు అమలు దిశగా తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను విస్తరించే లక్ష్యంతో పర్వతమాల పథకం కింద ఐదు రోప్‌వేల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. రోప్‌వేలు పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడాన్ని సులభతరం చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. మరోవైపు, సేతు బంధన్ పథకం కింద మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీలు) నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ రహదారి ప్రాజెక్టు ముందుకు సాగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని 34 పనులకు సీఆర్ఐఎఫ్ నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి కోరగా, ఈ అంశంపై సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మార్గంలోని ఎన్‌హెచ్-65 విస్తరణ పనులను వేగవంతం చేసే అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. పుల్లూరు నుంచి నల్గొండ వరకు పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చించారు.

More Stories
దివ్యాంగులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి
కరవుతో రైతులు చస్తుంటే కేబినెట్ రద్దు చేసి ఢిల్లీకి పారిపోయిన రేవంత్
మెదక్ జిల్లాలో వెలుగులోకి 1,100 ఏళ్ల నాటి గజలక్ష్మి శిల్పం