సమాజం, ప్రపంచ భద్రత, సంక్షేమం కోసం భారత్ ప్రజలు తమ సంప్రదాయాలను పాటిస్తూ పనిచేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు. అందరికీ సంతృప్తికరమైన జీవితం ఉండేలా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు.
దివంగత వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని నాగ్‌పూర్ జిల్లా దియోలాపూర్‌లోని గో-విజ్ఞాన్ అనుసంధాన్ కేంద్రంలో పలు కార్యక్రమాలను బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ గొప్ప వ్యక్తులను నిజంగా స్మరించుకోవడం అంటే వారి జీవితం, ప్రవర్తన, వారు అందించిన సేవలను మన సొంత ఆచరణ ద్వారా సజీవ వాస్తవాలుగా మలచుకోవడమే అని స్పష్టం చేశారు.
“మన జీవితం, సమాజం, ధర్మం భద్రంగా ఉండటానికి, ప్రపంచం మెరుగుపడటానికి భారత్ ప్రజలు తమ సంప్రదాయాల ప్రకారం జీవించి విజయాన్ని సాధించాలి. ప్రతి ఒక్కరికీ సంతృప్తికరమైన జీవితం ఉండాలి. అందుకోసం మనమంతా ఏదో ఒకటి చేయాలి” అని భగవత్ చెప్పారు. సమాజ పరిమాణంతో పోలిస్తే మంచి పనులు చేస్తున్నవారి సంఖ్య తక్కువగా ఉందని చెబుతూ సామాజిక కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.
మంచి వ్యక్తులను గుర్తు చేసుకోవడానికి రెండు మార్గాలున్నాయని పేర్కొంటూ మంచి పనులు చేయడం ఒకటైతే, వాటిని చేసినవారిని కేవలం గుర్తు చేసుకోవడం మరొకటని పేర్కొన్నారు. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను చూపుతూ సమాజం కోసం మంచి పని మరెవరైనా చేయాలని చాలామంది ఆశిస్తున్నారని భగవత్ తెలిపారు. మంచి పని జరిగినప్పుడు అందులో సమాజం మొత్తం భాగస్వామ్యం ప్రతిఫలిస్తుందని స్పష్టం చేశారు.
త్యాగం, సహనం చూపేవారు ఇతరులకు స్ఫూర్తినిస్తారని చెప్పారు. కష్టమైన మార్గాలను ఎంచుకుని ముందుకు సాగేందుకు వారు ప్రేరణగా నిలుస్తారని, వ్యక్తిగత ప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా సామాజిక సంక్షేమానికి అంకితమయ్యారని భగవత్ చెప్పారు. ప్రజలు వారి నిబద్ధతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. `మీరు ఎక్కువ ఇస్తే.. తిరిగి మీకు కూడా ఎక్కువే లభిస్తుంది’ అని తెలిపారు.
“మన సమాజానికి పండుగలంటే చాలా ఇష్టం, మనం వాటిలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటాం. కానీ ‘చేయాల్సిన పనిని నేనే చేస్తాను’ అని ప్రజలు సాధారణంగా ఆలోచించరు. ఉద్యోగం, కుటుంబ పోషణ వంటి బాధ్యతలు ఉన్నాయని చెబుతూనే, సమాజం కోసం ఏదైనా మంచి పనిని వేరే ఎవరో ఒకరు చేయాలని ప్రజలు ఆశిస్తుంటారు,” అని భగవత్ పేర్కొన్నారు.
దివంగత సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే, దివంగత అశోక్ సింఘాల్‌లను ప్రస్తావిస్తూ, వారు ఒక గొప్ప లక్ష్యం కోసం తమ జీవితాలను అంకితం చేశారని, అందుకనే ఇప్పటికీ విస్తృతంగా గౌరవించబడుతున్నారని ఆయన గుర్తు చేశారు. “అశోక్ సింఘాల్, మోరోపంత్ పింగ్లే దేశ శ్రేయస్సు కోసం సర్వస్వం అంకితం చేసే మార్గంలో అడుగుపెట్టినప్పుడు, వారు అంతగా ప్రసిద్ధి చెందలేదు. కానీ వారిలో ఒక విషయం స్పష్టంగా కనిపించేది: ‘నా జీవితం కేవలం నా కోసం మాత్రమే కాదు, ఈ దేశం కోసం కూడా’ అనే దృఢ సంకల్పం వారిలో ఉండేది. ఆ సంకల్పంతోనే వారు తమ జీవితమంతా (నిస్వార్థంగా) పనిచేశారు,” అని ఆయన పేర్కొన్నారు.
ఏమవుతుందో, ఏం జరగదో, తమకు ఏమవుతుందో లేదా ప్రతిఫలంగా ఏం లభిస్తుందో అనే ఆందోళన లేకుండా ప్రజలు తమ జీవితాల్లో తమ శక్తియుక్తులన్నింటినీ ధారపోయాలని చెబుతూ మంచి పనిని ప్రారంభించినవారిని గుర్తు చేసుకోవడమే నిజమైన నివాళి అని డా. భగవత్ స్పష్టం చేశారు.
“మనం ఒక సంకల్పం చేసుకుని, అది ఎంత చిన్నదైనా లేదా మన సామర్థ్యానికి మించినదైనా సరే, దాని కోసం మన సమయాన్నంతటినీ, శక్తినీ ధారపోస్తే… అలాగే నేను ఏదైనా సంపాదించినట్లయితే, అందులో కొంత భాగాన్ని స్వయంగా నా చేతులతోనే దానం చేయగలగాలి. నేను అనేక విషయాల కోసం సమయం వెచ్చిస్తుంటాను; అలాగే నా ప్రజలు, నా భూమి, నా అడవులు, నా పశువులు, నా వ్యవసాయం కోసం కూడా కొంత సమయం కేటాయించాలి,” అని ఆయన సూచించారు. ప్రజలు అటువంటి సంకల్పం పూని ఆచరణలో పెడితే, ఎంతో గొప్ప విజయాలు సాధించిన ఆ మహనీయుల స్మృతిని సజీవంగా నిలపగలమని చెప్పారు.
విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ, మహనీయులను స్మరించుకోవడం అనేది కేవలం మాటలకు పరిమితం కాకూడదని, అది ఆచరణ, కృషి, దృఢ సంకల్పం ద్వారా వ్యక్తమవ్వాలని చెప్పారు. అశోక్ జీలో ‘సత్వ గుణం’ పుష్కలంగా ఉండేదని, ఆయన హిందూ సమాజానికి ‘రజో గుణాన్ని’—అంటే పోరాడే శక్తిని, తమ సంకల్పాన్ని నెరవేర్చుకునే దృఢ నిశ్చయాన్ని—ప్రసాదించారని ఆయన పేర్కొన్నారు.

More Stories
బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో పర్యటించిన హమాస్ అగ్రశ్రేణి కమాండర్లు
విలక్షణ నటుడు, దర్శకుడు నానా పటేకర్ కన్నుమూత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు భారత్ 3 శాంతి సూత్రాలు