ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ లో తీవ్రమైన తాగునీటి ముప్పు 

హైదరాబాద్ నగరంలో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు తీవ్రమై తాగునీటి సమస్య ముప్పు పొంచి ఉంది.  తెలంగాణలో 17 శాతం వర్షపాతం లోటు కారణంగా నగరానికి నీటిని అందించే జలాశయాలు కుచించుకుపోతుండటంతో, సాధారణ వేసవి కొరత కంటే కొన్ని నెలల ముందే, డిసెంబర్ లేదా జనవరిలోనే నగరంలో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నీటి లోటును ప్రకటించి, వ్యవసాయానికి ఇకపై నీటిని విడుదల చేయవద్దని నీటిపారుదల అధికారులకు సూచించింది.
 
కోటిన్నరకు పైగా జనాభా ఉన్న నగరంలో దప్పిక తీర్చేందుకు జలమండలి రోజూ 600 ఎంజీడీల నీటిని అంటే 227 కోట్ల 12 లక్షల 46 వేల లీటర్లను సేకరించి సరఫరా చేస్తోంది. కృష్ణానది నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 162 ఎంజీడీలు, సింగూరు, మంజీరా నుంచి 120 ఎంజీడీలు, జంట జలాశయాల నుంచి 45 ఎంజీడీల తాగునీరు అందుతోంది.  
అయితే నగర ప్రజల అసలు అవసరాలకు మరో 100 నుంచి 200 ఎంజీడీల నీరు అదనంగా అవసరమవుతోంది.
ప్రస్తుత డిమాండ్ 700 నుంచి 750 ఎంజీడీలకు చేరింది. గతేడాది సెప్టెంబర్ చివరి నాటికి అన్ని ప్రాజెక్టులలో కలిపి 25 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఈ ఏడాది కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ప్రస్తుతం సింగూరు, మంజీరా ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కు దగ్గర కావడంతో అత్యవసర పంపింగ్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు.  జలమండలి పరిధిలోని 14న్నర లక్షల కనెక్షన్లకు నీరు అందించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
లోటు వర్షపాతం కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోతున్నాయి. దీంతో గ్రౌండ్ వాటర్ పై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. జలాశయాల్లో నీటి నిల్వలు రానున్న మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని అంచనా వేస్తున్నారు.  శివారు మున్సిపాలిటీలను గ్రేటర్ లో కలపడంతో ఆ ప్రాంతాలకు నీరు అందించడం మరింత కష్టతరంగా మారుతుంది. గృహ అవసరాలతో పాటు వాణిజ్య అవసరాలకు కూడా జలమండలి నీటిపై ఆధారపడటం వల్ల కొరత తీవ్రమవుతోంది. భూగర్భజలాలను అనవసరంగా తోడితే భవిష్యత్తులో చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. 
 
తాజా పరిస్థితులను నగర ప్రజలు అర్థం చేసుకొని బాధ్యతగా నీటిని వినియోగించుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ఇస్తున్న నీటిలో 95 శాతం సరిపోవాలని, సరిపోకపోతే అదనంగా వాడుతున్నట్లే లెక్క అని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటి వృధాను అరికట్టాలి. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భజలాలను పెంపొందించుకోవడానికి ప్రజలందరూ సహకరించాలి. ప్రభుత్వ చర్యలతో పాటు సామూహిక భాగస్వామ్యం ఉంటేనే ఈ తాగునీటి సంక్షోభం నుంచి బయటపడవచ్చు. 

About The Author