రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25శాతం) పెంచింది. దీంతో రెపో రేటు 5.50శాతానికి చేరింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. 2023 ఫిబ్రవరి తర్వాత వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచడం ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజా వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో మూడు రోజులపాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటుతోపాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 5.25 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటును 5.75 శాతానికి పెంచారు. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా, విస్తృతంగా కొనసాగుతున్నాయని మల్హోత్రా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతుండటాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను ఆయన 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.1 శాతానికి చేర్చారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే ప్రసక్తే లేదని, మున్ముందు వడ్డీ రేట్ల పెంపు లేదా స్థిరంగా ఉంచడం మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగానే ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటివి భవిష్యత్తులో దేశీయ ఆర్థిక కార్యకలాపాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉందని మల్హోత్రా తెలిపారు. దాంతో పలు ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. భారత్‌లోనూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది.
ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటుకు హౌసింగ్, వెహికల్ లేదా ఇతర స్థిరాస్తి లోన్ తీసుకున్నవారిపై వడ్డీ భారం పడనుంది. ఈ వడ్డీ భారాన్ని ఆయా బ్యాంకులు రెండు రకాలుగా వినియోగదారునిపై వేయనున్నాయి. నేరుగా ఈఎంఐపైన వేస్తే మీరు చెల్లించే నెలవారి ఈఎంఐ పెరుగుతుంది. అలా కాకుండా లోన్ కాలవ్యవధి పైన కూడా వేయవచ్చు. అంటే ఈఎంఐలో తేడా రాకుండగ మొత్తం లోన్ చెల్లించే కాల వ్యవధి పెరుగుతుంది. బ్యాంకును సంప్రదించి ఈ రెండింటిలో ఏది మీకు వర్తించింది అనేది తెలుసుకోవచ్చు. ఈఎంఐ పెంచుకోవడం మంచిదా? లేక లోన్ కాలవ్యవధి పెంచుకుంటే మంచిదా అనేది ఆర్థిక నిపుణులను అడిగి తెలుసుకోవాలి.

More Stories
పంజాబ్ సీఎం మాన్ క్యాంపు కార్యాలయంలో సీబీఐ సోదాలు
జిడిపి 6.6 శాతం నుంచి 7.1 శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు
భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన