దిల్లీ: ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణను ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు స్వాగతించాయి. ఈసీ తాజా స్పష్టీకరణతో విపక్షాలు లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానం లభించిందని ఆయా పార్టీలు పేర్కొన్నాయి.
తెలుగుదేశం పార్టీ, ఎల్జేపీ (రాంవిలాస్), జేడీ(యూ) నేతలు ఈ అంశంపై స్పందించారు. ఎన్నికల సంఘం వివరణ రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక అంశాలపై ఈసీ స్పష్టత ఇచ్చిందని కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రాంవిలాస్) నేత చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. మరోవైపు, ఎన్నికల సంఘంపై విపక్షాలు అనవసరమైన సందేహాలను వ్యక్తం చేస్తున్నాయని జేడీ(యూ) కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా విమర్శించారు.
ఓటర్ల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించడం, అవసరమైన వర్గాల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం, ఆన్లైన్ ద్వారా విచారణ చేపట్టడం వంటి చర్యలు ప్రక్రియలో పారదర్శకతకు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు.
ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని ఎన్డీయేలోని కొన్ని పార్టీలు గతంలో కోరిన నేపథ్యంలో, ఈసీ తాజా వివరణపై ఆయా పార్టీల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈసీ వివరణతో కాంగ్రెస్ ఆరోపణలు బట్టబయలయ్యాయి: భాజపా
ఓటర్ల జాబితాల సవరణ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకుంటూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని భాజపా ఆరోపించింది. ఎన్నికల సంఘం తాజా వివరణతో కాంగ్రెస్ చేసిన పలు ఆరోపణలకు ఆధారం లేదని స్పష్టమైందని పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన సందర్భాల్లో ఈసీపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు.
భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ఆరోపణలు చేయడం కంటే ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. గాంధీ–వాద్రా కుటుంబాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యంగా ఉందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన పేర్కొన్నారు.

More Stories
విద్యార్థినిపై అత్యాచారం వదంతులతో లవ్లీ యూనివర్సిటీలో విధ్వంసం
SIRపై అపోహలకు తెర.. కీలక అంశాలపై ఈసీ స్పష్టత
2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి చివరిది!