తెలంగాణ ఓటర్ల జాబితాలో తొలిసారి 2023లోనే రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను దాటింది. ఇప్పుడు 2026 ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలోనూ మహిళల ఆధిక్యం కొనసాగుతున్నట్లు అందుబాటులో ఉన్న తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నది ముసాయిదా జాబితా మాత్రమే. తుది జాబితా నవంబర్ 9న వెలువడనుంది.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం జారీచేసిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,62,98,418 మంది పురుషులు కాగా 1,63,01, 705 మంది మహిళలు. మరో 2,676 మంది ట్రాన్స్ జెండర్లు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,287 మంది ఎక్కువ. ప్రతి 1,000 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్ల సంఖ్య 1,000.2గా నమోదైంది.
అంతకుముందు జనవరి 2023లో ఈ నిష్పత్తి 992గా ఉండేది. అంటే ఏడాది వ్యవధిలోనే మహిళా ఓటర్ల నిష్పత్తి గణనీయంగా మెరుగుపడింది. 2026 సర్‌కు ముందు తెలంగాణలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటింటి సర్వేలో 2,64,87, 213 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. మిగిలిన 73,39,235 మంది పేర్లను తాత్కాలికంగా ఏఎస్ డిడి కేటగిరీలో ఉంచారు.
ఇందులో మరణించినవారు, ఆచూకీ లేనివారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలిపోయినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనవారు ఉన్నారు. అయితే ఈ 73.39 లక్షల పేర్లను శాశ్వతంగా తొలగించినట్లు కాదు. వీరిలో అర్హులైన వారు తమ పేర్లను తిరిగి నమో దు చేయించుకునే అవకాశం ఉంది. సర్ ప్రక్రియలో మరో 92.87 లక్షల మంది ఓటర్ల వివరాల్లో పరిశీలన అవసరమని గుర్తించారు.
వారిలో 60,50,9 18 మంది విషయంలో అనామలీస్ ఉన్నట్లు గుర్తించారు. మరో 32,36,659 మంది పేర్లను 2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయలేకపోయారు. వీరికి నోటీసులు ఇచ్చి వివరాలు, ఆధారాలను పరిశీలిస్తున్నారు. 2026 సర్ తర్వాత కూడా మహిళా ఓటర్ల ఆధిక్యం కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ముసాయిదా జాబితాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా పురుషులు-మహిళల సంఖ్యను విడిగా చూపించే తుది గణాంకాలు ఇంకా పూర్తి కాలేదు.
అది పూర్తయితే మహిళలు ఎంతమంది ఎక్కువగా ఉన్నారో స్పష్టంగా తేలుతుంది. సర్ ప్రక్రియలో కొత్తగా అర్హత పొందిన యువతకు కూడా ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. 18 ఏళ్లు నిండిన వారు ఫారం-6 ద్వారా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023లోనే 18-19 ఏళ్ల వయసు గల 9,99,667 మంది యువ ఓటర్లు నమోదయ్యారు. ఈ వయసు వర్గంలో మహిళా ఓటర్ల నమోదు పెరగడం కూడా లింగ నిష్పత్తి మెరుగుపడటానికి ఒక కారణం.

More Stories
దివ్యాంగులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి
కరవుతో రైతులు చస్తుంటే కేబినెట్ రద్దు చేసి ఢిల్లీకి పారిపోయిన రేవంత్
మెదక్ జిల్లాలో వెలుగులోకి 1,100 ఏళ్ల నాటి గజలక్ష్మి శిల్పం