ఇరాన్ యుధ్దం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సౌదీ అరేబియాలో 110 టన్నుల ముడి యురేనియం నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. మెదీనా ప్రాంతంలో యురేనియం సహా పలు అరుదైన ఖనిజాలు బయటపడ్డట్లు సౌదీ అరేబియాకు చెందిన ఎనర్జీ మినిస్టర్ ప్రిన్స్ అబ్దులాజిజ్ బిన్ సల్మాన్ తెలిపారు. మెదీనా ప్రాంతంలోని జబల్ సయిద్ ప్రాజెక్టు వద్ద అధ్యయనం చేస్తుండగా 110 టన్నుల అరుదైన ఖనిజాలు, యురేనియం నిల్వలు లభ్యమైనట్లు ఆయన వెల్లడించారు.
వియన్నాలో జరిగిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) 70వ సాధారణ సమావేశంలో తన ప్రసంగం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఆ ఖనిజంలో యురేనియం స్థాయి (గ్రేడ్) ఎంత ఉందో మంత్రి పేర్కొనక పోవడంతో ఆ శిల నుండి వాస్తవానికి ఎంత యురేనియంను వెలికితీయవచ్చో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఫాస్ఫేట్ ఎరువుల ఉత్పత్తిలో ఉప-ఉత్పత్తిగా యురేనియంను వెలికితీయడానికి సౌదీ అరేబియా కూడా కృషి చేస్తోంది. ఫాస్ఫేట్ ఎరువులను ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎగుమతిదారు సౌదీ అరేబియా. మదీనా అల్-మునవ్వరా ప్రాంతం, ఖనిజాలు సమృద్ధిగా ఉన్న అరేబియన్ షీల్డ్‌లో ఉంది. ఇందులో జబల్ సయీద్ బెల్ట్ కూడా ఉంది. ఇది ఇప్పటికే రాగి, బంగారం, యురేనియంతో సహా ఇతర ఖనిజాలకు ప్రసిద్ధి చెందింది.
ఈ బెల్ట్‌లో యురేనియం ఉందని ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ గతంలోనే సూచించారు. చైనాతో కలిసి చేసిన మునుపటి భూగర్భ సర్వేల ఆధారంగా, సౌదీ అరేబియా యురేనియం వనరులు సుమారు 60,000 నుండి 90,000 టన్నుల వరకు ఉన్నాయని అంచనాలు తెలిపాయి. ఈ కొత్త ఆవిష్కరణ గత అంచనాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది కానీ, వాణిజ్యపరంగా వెలికితీయగల పరిమాణాన్ని ఇంకా వెల్లడించలేదు.
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం సౌదీ చాలా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా ఇరాన్ మద్దతుదారులైన హౌతీ ఉగ్రవాదులు సౌదీ అరేబియాపై దాడులకు దిగుతోంది. దీనివల్ల అక్కడి చమురు క్షేత్రాలు దెబ్బతింటున్నాయి. పోర్టులపై, చమురు నౌకలపై దాడి జరుగుతోంది. దీనివల్ల సౌదీ తీవ్రంగా నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యురేనియం నిల్వలు బయటపడటం ఆ దేశానికి భారీ ఊరటనిచ్చేదే.
సున్నీలకు చెందిన సౌదీ అరేబియాకు, షియాలకు చెందిన ఇరాన్‌కు మధ్య ఘర్షణ నెలకొంది. అయితే, ఇప్పుడు పరిస్తితుల్ని చక్కదిద్దుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా కూడా 2030లోపు అణ్వాయుధ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికాతో కలిసి సౌదీ అణు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇలాంటి తరుణంలో యురేనియం బయటపడటం కలిసొచ్చే అంశమే.

More Stories
మరో 25 ఏళ్లల్లో అమెరికాను అధిగమించనున్న భారత్
బ్రిక్స్ లో చర్చకు రాని ఉమ్మడి కరెన్సీ
ప్రైవేట్‌గా ఉండాలన్న టాటా సన్స్ అభ్యర్థనను తిరస్కరించిన ఆర్బిఐ