నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీరవనిత పొణకా కనకమ్మ 

నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీరవనిత పొణకా కనకమ్మ 
బి. సురేంద్రనాథ్ రెడ్డి, 
కన్వీనర్, శ్రీమతి పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి, నెల్లూరు

దేశంకోసం సర్వం త్యాగం చేయటంతో పాటు స్త్రీ విద్య, సాహిత్య రంగాల్లోనూ ఎనలేని సేవలు అందించి స్వతంత్ర సంగ్రామంలో నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీరవనిత పొణకా కనకమ్మ గారి వర్ధంతి నేడు. 1892 జూన్ 10న పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, కావమ్మలకు జన్మించిన కనకమ్మకు  తొమ్మిదేళ్ల ప్రాయంలోనే మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. కాపురానికి వెళ్లేనాటికే పొణకా కుటుంబానికి 150 ఎకరాల స్థిరాస్తి ఉంది. అయినా అందరు సంపన్నులు మాదిరిగా కాకుండా, సంఘ సేవకోసం ఇల్లు విడిచి కనకమ్మ ఉద్యమ బాటన నడిచారు. 

పోట్లపూడి గ్రామానికి ప్రముఖులు ఎవరు వచ్చినా అప్పట్లో కనకమ్మ ఆతిథ్యం స్వీకరించే వెళ్లేవారు. 1907 వందేమాతరం ఉద్యమం సందర్భంగా ఆంధ్రదేశానికి వచ్చిన మహావక్త బిపిన్‌పాల్ ఒక దినమంతా పోట్లపూడిలోనే గడిపారు. 1913 పోట్లపూడిలో సజన రంజని సమాజం స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం జాతీయ పాఠశాల ఏర్పాటుకు పొణకా కనకమ్మే కారణం. అప్పుడే గ్రామాలలో ఆరోగ్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

1917లో ఐదవ ఆంధ్ర మహాసభ నెల్లూరులో జూన్ మొదటి వారంలో జరిగింది. అదేరోజు మహిళల సభ కూడా జరిగింది. మహిళలను రాజకీయాల్లోకి ఆకర్షించాలని తీర్మానం జరిగింది. ఈ సభలో కనకమ్మ మాట్లాడారు. అదే సమయంలో ప్రారంభమైన అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమానికి జిల్లాలో పోట్లపూడి గ్రామమే కేంద్రమైంది. కనకమ్మ స్వయంగా చరఖా చేపట్టారు. స్వదేశీ చేనేత కేంద్రం ఏర్పడింది. తను స్వయంగా నేసిన ఖద్దరు పంచెను మహాత్మాగాంధీకి కనకమ్మ కానుకగా పంపారు.

పల్లెపాడులో సత్యాగ్రహ ఆశ్రమాన్ని 1921 ఫిబ్రవరి 7న మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఈ ఆశ్రమం కోసం కనకమ్మ తన ఒంటిపైనున్న బంగారు నగలు అమ్మి విరాళంగా ఇచ్చారు. ఆనాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆమె బంగారు నగలు ధరించలేదు. పల్లెపాడు పెన్నానది ఒడ్డున గాంధీ అశ్రమం కొరకు 12 ఎకరాలు కొని స్వరాజ్యం సంపాదించాలనే ధ్యేయంతో చతుర్వేదుల కృష్ణయ్యకు ఉచితంగా ఇచ్చింది.

భారత జాతీయ కాంగ్రెస్ సంస్థలో లోకమాన్య బాలగంగాధర తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అంటూ చాటిన విప్లవ మార్గం నెల్లూరు యువతను ఆకర్షించింది. ఆ యువతకు కనకమ్మ వెన్నుదన్నుగా నిలిచింది.  1916 నుండి 1919 వరకు కొంతకాలం పాటు విప్లవాత్మక రాజకీయాల పట్ల ఆకర్షితులైన ఆమె, ఆ తర్వాత మహాత్మా గాంధీకి అంకితభావం కలిగిన అనుచరురాలిగా మారారు. నిషిద్ధ సాహిత్యాన్ని రహస్య స్థలల్లో భద్రపరిచిందామె. పాండిచ్చేరి నుంచి ఆంగ్లేయుల పై పోరాటానికి పిస్తోళ్లను తెప్పించి తను ధీరవనితనని చాటారు.

1919లో గద్దర్ పార్టీ విప్లవకారుడు దర్శి చెంచయ్య జైలునుంచి విడుదలై కనకమ్మను కలిశారు. ఆ ఏడాదే ఆమె తన గ్రామంలో హరిజన బాలుర వసతి గృహం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోట్లపూడికి వచ్చి ఆమె ఆతిధ్యం స్వీకరించారు.  కనకమంలోని వీరావేశం గుర్తించిన నాటి నాయకులు ఆమెను `కణకణమండే విప్లవ కణిక’గా అభివర్ణించారు.గాంధీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో తిలక్ స్వరాజ్య నిధికి విరాళాల కోసం పిలుపునిచ్చారు.
మహిళలు తమ ఆభరణాలు ఒలిచి ఇచ్చి వేశారు. అలాగే రాట్నాలు పట్టి నూలు తీయడంతో ఖాదీ ప్రచారంతో పాటు విదేశీ వస్తువుల బహిష్కరణలో నెల్లూరీయులు ముందు నిలిచారు. 1922 ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్‌లో తొలి సత్యాగ్రహి దేశబంధు దువ్వూరి సుబ్బమ్మ తొలిసారిగా అరెస్ట్ అయ్యారు. ఈ సంఘటన కనకమ్మను కదిలించింది. 1930లో పల్లెపాడులో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో కనకమ్మ ప్రముఖ పాత్ర వహించారు. ఆమె నాయకత్వంలో మైపాడుకు భారీ స్థాయిలో మహిళలు తరలి వెళ్లారు.1930 జూలై 7న కనకమ్మ అరెస్టు అయి నెల్లూరు, వేలూరులలో జైలు శిక్ష అనుభవించారు. జైలు జీవితంలో భారత పురాణాలను సహచర ఖైదీలకు చదివి వినిపించేవారామె. 1932 మే 24న శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా సారా దుకాణాల వద్ద పికెటింగ్ చేస్తూ కనకమ్మ అరెస్టయ్యారు. లాఠీ చార్జీలలో ఆమె భుజంపై బలమైన గాయమైంది. ఒక సారా దుకాణదారుడు ఉమ్మి ఊసినా తొణకని సహనశీలి కనకమ్మ. ఈ కేసులో ఆమెకు 18 నెలల జైలు శిక్ష పడింది. అనారోగ్య కారణంగా 1933 జూన్ నెల 30న ఆమెను జైలునుంచి విడుదల చేశారు.

జమీందార్లకు వ్యతిరేకంగాా నడిచిన జమీన్‌రైతు సంఘం పోరాటంలో కనకమ్మ అపర రుద్రమదేవిలా పోరాడారు. 1929 డిసెంబర్‌లో  జరిగిన రైతు సభకు ఆచార్య రంగా అధ్యక్షత వహించి జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలని తీర్మానించారు. 1917 నుంచే పొణకా కనకమ్మ ఎన్నో సాహిత్య రచనలు చేశారు. వ్యాసాలు, కవితలు రచించారు. ఆమెకు ప్రతిష్టాకరమైన గృహలక్ష్మి స్వర్ణ కంకణం లభించింది.

1923లో బాలికా విద్య కోసం కనకమ్మ కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో వృత్తి విద్య కూడా ఏర్పాటు చేశారు. 1923లో ఆ సంస్థను ప్రకాశం పంతులు ప్రారంభించారు. నిధుల లేమితో తర్వాత మూసివేశారు. తిరిగి 1929లో పాఠశాల కోసం రెండెకరాల భూమి కొన్నారు. 1929 మే 12న మహాత్మా గాంధీ పాఠశాల భవనాలకు పునాది రాయి వేశారు.

దేశభక్తులైన తిక్కవరపు రామిరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డిల విరాళాల ద్వారా నిధుల సేకరణతో 1944 జూన్ 17న కస్తూర్బా జాతీయ పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఈ పాఠశాల నిధుల కోసం ప్రముఖ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సొంత ఖర్చులతో నెల్లూరు వచ్చి సంగీత కచేరి చేశారు.  అందుకే గాంధీజీ ఒకసారి నెల్లూరులో చూడదగినది ఏమైనా ఉంటే అది కస్తూరిదేవి విద్యాలయమే అని అన్నారు. నేడు ఈ విద్యాలయం వందలాది మంది పేద విద్యార్ధినులకు విద్యాదానం చేస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వీర వనిత పొణకా కనకమ్మ 1963 సెప్టెంబర్ 15న కన్ను మూశారు. 
 
ఆమెకు ఎటువంటి అధికారిక పాఠశాల విద్య లేనప్పటికీ, స్వయంకృషితో తెలుగు, హిందీ, సంస్కృత భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. 1934లో తన ఏకైక కుమార్తె, వర్ధమాన రచయిత్రి, సంఘ సేవకురాలు అయిన ఎం. వెంకటసుబ్బమ్మను కోల్పోయిన తర్వాత, ఆమె రమణ మహర్షి, అన్నారెడ్డిపాలెంకు చెందిన రామయోగి భక్తురాలిగా మారారు. 
 
పోనక కనకమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ తెలుగులో తొలి జంట కవయిత్రులు. వారు రమణ మహర్షిపై అనేక తాత్విక కవితలు రాశారు. వాటిలో ‘ఆరాధన’, ‘నివేద్యం’ ముఖ్యమైనవి. వారు భగవద్గీత సారాంశాన్ని ‘జ్ఞాన నేత్రం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆమె శ్రీ రామయోగి జీవిత చరిత్రను తెలుగు, ఆంగ్ల భాషలలో రచించారు. 
కనకమ్మ మంచి రచయిత్రి; ఆమె రచనలు భారతి, కృష్ణాపత్రిక, గృహలక్ష్మి, అనసూయ, హిందుసుందరి, జమీన్‌రైతు, అనేక ఇతర పత్రికలలో ప్రచురితమయ్యాయి.
వెంకటగిరి జమీందారు అణచివేత, దుర్మార్గపు చర్యల కారణంగా ఆమె తన ఆస్తిని కోల్పోయారు. తన జీవితకాలంలో, ఆమె తన నివాసాలలో అనేకమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులకు,  కవులకు ఆతిథ్యం ఇచ్చారు. బాబూ రాజేంద్రప్రసాద్, దేశబంధు చిత్తరంజన్ దాస్ వంటి జాతీయ నాయకులు, అలాగే ఉదయశంకర్, ఆత్రేయ, స్థానం, తిరువంకూర్ సోదరీమణులు వంటి కళాకారులు ఆమె అతిథులుగా ఉన్నారు. 
 
ఆమె ‘గృహలక్ష్మి స్వర్ణకంకణం’ సన్మానాన్ని అందుకున్నారు. మద్రాస్ మహిళా సభ రజతోత్సవ వేడుకల సందర్భంగా, శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ కనకమ్మను వెండి ఫలకంతో సత్కరించారు. కనకమ్మ, ఆమె కుటుంబ సభ్యులందరూ రచయితలే.వీరి రచనలు ‘భారతి’, ఇతర పత్రికలలో కనిపిస్తాయి. ఆమె చిన్న తమ్ముడు “కళాప్రపూర్ణ” మరుపూరు కోదండరామిరెడ్డి ప్రఖ్యాత పాత్రికేయుడు, ప్రముఖ రచయిత. నెల్లూరు జిల్లాలో జమీందారీ రైతు ఉద్యమానికి మద్దతుగా ఆమె నెల్లూరులో ‘జమీన్ రైతు’ అనే తెలుగు వారపత్రికను స్థాపించారు.

ఈ స్వాతంత్ర్య సమరయోధురాలిని నేటి ప్రజా ప్రతినిథులు  స్మరించిన జాడలేదు. ఏ పాఠ్యపుస్తకాలలో ఈమె చరిత్ర లిఖింపబడలేదు. మహిళా జాతికి వెలుగుచుక్కైన కనకమ్మ స్మృతికి నెల్లూరు నగరంలో కనీసం శిలా విగ్రహం ఏర్పాటు చేయకపోవడం అన్యాయం.  కనకమ్మ జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చి మహిళా స్ఫూర్తికి ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడే ఆమెకు సరైన నివాళి కాగలదు.