బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఇది ఒక పెద్ద విజయం. బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన దినంగా నవంబర్ 27ను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ చర్య, ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ ప్రచారానికి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా 2023 నుండిఎన్‌డిటివి చేస్తున్న ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన ఒక పెద్ద మద్దతు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటానికి ఒక ప్రత్యేక దినాన్ని కేటాయించాలని ఐక్యరాజ్యసమితికి ఒక తీర్మానాన్ని ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ వ్యవస్థాపకుడు భువన్ రిభు ప్రతిపాదించారు. సెప్టెంబర్ 4న సియెర్రా లియోన్ ఐక్యరాజ్యసమితిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, అది ఆమోదం పొందింది.
నవంబర్ 27వ తేదీ భారతదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఆ రోజే భారత ప్రభుత్వం 2024లో ‘బాల వివాహ ముక్త్ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని స్వాగతిస్తూ, ఆ తీర్మానం ఆమోదం పొందిన సమయంలో ఐక్యరాజ్యసమితికి ఆహ్వానించిన ఏకైక పౌర సమాజ ప్రతినిధి అయిన రిభు, ఇది భారతీయులందరికీ గొప్ప గర్వకారణమని తెలిపారు.
“ఈ రోజు భారతదేశం బాలల రక్షణకు విశ్వగురువు. మొదట పిల్లలు, సమాజాలచే ప్రారంభించబడి, ఆ తర్వాత ప్రభుత్వ మద్దతుతో విస్తరించిన ‘బాల్య వివాహ రహిత భారత్’ ప్రచారం, 2024 నవంబర్ 27న 25 కోట్లకు పైగా ప్రజలు ఏకమై ప్రతిజ్ఞ చేయడంతో, ఈ రోజు ప్రపంచం అంగీకరించిన అంతర్జాతీయ దినోత్సవంగా మారింది,” అని ఉద్వేగంతో రిభు పేర్కొన్నారు.
ఆయన ఇంకా ఇలా చెప్పారు: ” 2030 నాటికి బాల్య వివాహాలను అంతం చేయడానికి, ప్రతి బిడ్డ తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా వారికి విద్య, రక్షణ, అభివృద్ధిని అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు నిర్ణయాత్మక నాయకత్వం వహించాల్సిన సమయం ఇది.”
ఈ రోజును సాధ్యం చేయడంలో ప్రభుత్వం, పౌర సమాజ సమూహాల కృషిని రిభు ప్రశంసించారు. తాజా జాతీయ గణాంకాలు కూడా బాల్య వివాహాల తగ్గుదలను ప్రతిబింబిస్తున్నాయి. 2019-21 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్-5) ప్రకారం, 20-24 ఏళ్ల వయస్సు గల మహిళల్లో 23.3% మంది 18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్నారు; కాగా, ఎన్ఎఫ్ హెచ్ఎస్-6 (2023-24)లో ఈ శాతం 20.1%గా నమోదైంది.
2026 నాటికి బాల్య వివాహాల రేటును 10% తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి బాల్య వివాహాలను నిర్మూలించాలనే ప్రపంచవ్యాప్త సంకల్పం, ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5’ (లింగ సమానత్వం)లోని ‘లక్ష్యం 5.3’కి అనుగుణంగా ఉంది. ఈ లక్ష్యం బాల్య వివాహాలు, చిన్న వయసులో జరిగే వివాహాలు మరియు బలవంతపు వివాహాలతో సహా అన్ని హానికరమైన ఆచారాలను నిర్మూలించాలని పిలుపునిస్తోంది.

More Stories
పర్వతారోహకులతో కరిగిపోతున్న హిమాలయాలు
బెంగాల్లో 1000 విద్య భారతి పాఠశాలల ఏర్పాటు
ఓ గంట భారీ వర్షానికే ఢిల్లీ అతలాకుతలం