ప్రత్యేక సుంకాల మినహాయింపులు ఇస్తేనే అమెరికాతో తుది ఒప్పందం

ప్రత్యేక సుంకాల మినహాయింపులు ఇస్తేనే అమెరికాతో తుది ఒప్పందం
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు సుంకాల విషయంలో ప్రత్యేక మినహాయింపులకు అమెరికా అంగీకరించిన తర్వాతే ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతుది వివరాలను వెల్లడిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.  ‘‘న్యూజిలాండ్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలో అమలులోకి వస్తుంది. ఆ తర్వాత 27 దేశాల కూటమి అయిన ఈయూతో అమలులోకి వస్తుంది. పోటీ దేశాలతో పోలిస్తే అమెరికా మనకు ప్రాధాన్యతా రేటును ఇచ్చేందుకు సిద్ధమైన వెంటనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు చేసి తుది వివరాలను ప్రకటిస్తాం’’ అని ప్రకటించారు. 
 
‘లేవరేజింగ్ ఎఫ్‌టీఏల ఆట్‌రీచ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ  రాబోయే కొద్ది నెలల్లో కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసూర్, ఎస్ఏసియు (దక్షిణాఫ్రికా కస్టమ్స్ యూనియన్), జిసిసి (గల్ఫ్ సహకార మండలి), ఇజ్రాయెల్‌ సహా ఇతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, అలాగే ఆసియా, కొరియా, జపాన్ వాణిజ్య ఒప్పందాలను సమీక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 
 
భారత్‌కు ఇతర పోటీదారుల కంటే తక్కువ రేటుకే ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటాను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే యూకే, మారిషస్, ఒమన్, యూఏఈ, ఆస్ట్రేలియాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం  ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఇరు దేశాలు మార్కెట్ విస్తరణ, వాణిజ్య అడ్డంకులను తొలగించడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 
 

ముసాయిదా ఒప్పందం ఇప్పటికే పూర్తయిందని, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో దీనిపై సంతకాలు చేసే అవకాశం ఉందని ఒక సీనియర్ అమెరికా అధికారి జులైలో తెలిపారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ‘సెక్షన్ 301’ వాణిజ్య విచారణలు మాత్రమే ఈ ఒప్పందానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రెండు దేశాల మధ్య ఒప్పందం ‘కాగితంపై సిద్ధంగా ఉంది’ అని, ఈ జాప్యం కేవలం సాంకేతిక విధివిధానాల వల్లనే తప్ప న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య పరిష్కారం కాని విభేదాల వల్ల కాదని ఆ అధికారి స్పష్టం చేశారు.   2025లో, అమెరికాకు భారత్ చేసిన మొత్తం వస్తువుల ఎగుమతులు 103.82 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అమెరికా నుండి భారత్‌కు జరిగిన ఎగుమతులు సుమారు 45.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం 149.42 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

2025లో ద్వైపాక్షిక సేవల వాణిజ్యం 92.23 బిలియన్ డాలర్లుగా నమోదైంది.ఇందులో భారత్ అమెరికాకు 48.67 బిలియన్ డాలర్ల విలువైన సేవలను ఎగుమతి చేయగా, అమెరికా నుండి 43.56 బిలియన్ డాలర్ల విలువైన సేవలను దిగుమతి చేసుకుంది.