పరకాల అమరవీరుల త్యాగాలు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేకరోన్తునిజాం నిరంకుశ పాలనపై ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు తెలిపారు. పరకాల అమరధామంలో అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
సరిగ్గా ఎనభై సంవత్సరాల క్రితం నిజాం నిరంకుశ పరిపాలనలో రజాకార్లు పరకాల ప్రజలపై సాగించిన మారణకాండ దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్‌ను తలపించిందని గుర్తుచేశారు. పరకాలలోని చాపలబండ వద్ద 19 మందిని, సమీపంలోని లక్ష్మీపూర్‌లో మరో ముగ్గురిని దారుణంగా ఊచకోత కోశారని, దాదాపు రెండు వందల మందికి పైగా గాయపడ్డారని వివరించారు.
నాటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపకుండా స్వతంత్రంగా ఉంచుతామని, పాకిస్తాన్‌తో కలుపుతామని నిజాం ప్రకటించిన వేళ, రజాకార్లు గ్రామాలపై పడి మహిళలను, అన్నదాతలను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్రాంపల్లిలో బావిలో పడేసి వందలాది మందిని చంపిన ఉదంతాలు, బైరాన్‌పల్లిలో గోడకు నిలబెట్టి కాల్చి చంపిన సంఘటనలు నాటి దారుణాలకు నిదర్శనాలని పేర్కొన్నారు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా నిజాం తలవంచడంతో సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైందని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరిస్తూ, సి.హెచ్. విద్యాసాగర్ రావు నాయకత్వంలో తెలంగాణ విమోచన సమితి ఆధ్వర్యంలో ఈ పరకాల అమరధామ స్తూపాన్ని నిర్మించారని, ఆ కమిటీలో తాను కూడా సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించడం ఎంతో గర్వకారణమని చెప్పారు.

More Stories
టెండర్లు, బిల్లులు పొందాలంటే సీఎంకు 15 శాతం కమీషన్
లక్షల కోట్ల రూ. భూకుంభకోణాలపై జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ
కాంగ్రెస్ నేతల జేబులు నింపడానికే కాచిగూడ ఎస్సీ హాస్టల్ బలి