పాకిస్థాన్‌లో మదర్సా కోసం వందేళ్ల నాటి ఆలయం కూల్చివేత

పాకిస్థాన్‌లో మదర్సా కోసం వందేళ్ల నాటి ఆలయం కూల్చివేత
 
పాకిస్థాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్దం పైబడిన ఒక హిందూ ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న మదర్సా విస్తరణ కోసం ఆ స్థలాన్ని వినియోగించుకునే ఉద్దేశంతోనే గత నెలలో ఈ ఆలయాన్ని కూల్చివేసినట్లు సమాచారం. సుమారు 125 ఏళ్ల నాటి ఈ కట్టడాన్ని పునర్నిర్మించాలని, ఆలయ భూమిలో జరిగిన ఆక్రమణలను తొలగించాలని స్థానికులు, మైనారిటీ సంఘాలు, ఒక రాజకీయ పార్టీ ఇస్లామాబాద్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కోరాయి. 
 
‘తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్’ (టి ఎల్ పి) అనే నిషేధిత మితవాద ఇస్లామిక్ పార్టీకి చెందిన కొందరు మతోన్మాదులు, పక్కనే ఉన్న మదర్సాలో ఆలయ స్థలాన్ని విలీనం చేసేందుకు ఆగస్టు 21న ఆ ఆలయాన్ని కూల్చివేశారు. అయితే, ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగానే 100-125 ఏళ్ల నాటి ఆ ఆలయం కూలిపోయిందని ప్రభుత్వం వాదిస్తున్నది. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన ఆలయం, లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్‌లోని సిరాజ్ గ్రామంలో ఉంది. 
 
మైనారిటీల సంక్షేమంపై దృష్టి సారించే ‘పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ’ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఈ ఆలయ కూల్చివేతకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని,  ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరింది. ఆ పార్టీ చైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా మాట్లాడుతూ తాము ఆగస్టు 28న పంజాబ్ అదనపు హోం కార్యదర్శిని కలిశామని, నిందితులు, ఆలయాన్ని రక్షించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
 
కూల్చివేసిన కట్టడం నుండి ఆలయ శిఖరం లోహపు భాగాలు, ఇటుకల వంటి ఇతర సామగ్రిని ఆ తర్వాత అక్కడి నుండి తరలించారని కూడా ఆయన ఆరోపించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని గతంలో ‘ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్’ ఒక మదర్సా కోసం లీజుకు ఇచ్చిందని, అయితే చాలా ఏళ్లుగా అద్దె చెల్లించకపోవడం, కేటాయించిన ప్రయోజనం కోసం ఆ స్థలాన్ని ఉపయోగించకపోవడంతో ఆ లీజును రద్దు చేశారని సహోత్రా పేర్కొన్నారు. 
 
రెవెన్యూ శాఖ నివేదికను ప్రస్తావిస్తూ, పలువురు వ్యక్తులు ఆ ఆస్తిలోని క్వార్టర్లను, ఇతర భాగాలను అక్రమంగా ఆక్రమించుకున్నారని సహోత్రా ఆరోపించారు. జనవరి 29 నాటి ఒక ఉత్తర్వులో, సియాల్‌కోట్‌లోని  డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ ఆ మదర్సా (మతపరమైన విద్యాసంస్థ)  లీజు హక్కులను రద్దు చేశారని, అలాగే అక్కడ అక్రమంగా ఉన్నవారిని తొలగించి ఆ ఆస్తిని సీల్ చేయాలని ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. 
 
“ఈ ఉత్తర్వు అమలు కాలేదు,” అని సహోత్రా ఆరోపించారు. ఆ ఆలయాన్ని దాని అసలు రూపంలో పునర్నిర్మించాలని సహోత్రా డిమాండ్ చేశారు. అలాగే పంజాబ్ అంతటా హిందూ దేవాలయాలు, సిక్కు గురుద్వారాలు, క్రైస్తవ చర్చిలతో పాటు వాటికి ఆనుకుని ఉన్న ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హిందూ సమాజ నాయకుడు రత్తన్ లాల్ కూడా ఆ పురాతన ఆలయ కూల్చివేతను ఖండిస్తూ దానిని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 
“ఆ స్థలాన్ని రక్షించడంలో లేదా ఆక్రమణదారులను తొలగించడంలో జిల్లా యంత్రాంగం, ఈటిపిబి తగిన చర్యలు తీసుకోలేదు, దీనివల్ల చివరికి ఆలయం కూల్చివేశారు,” అని లాల్ విమర్శించారు. ఆలయ కూల్చివేతలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నరోవాల్ జిల్లా శాంతి కమిటీ, పాక్ ధర్మ అస్తాన్ హిందూ కమిటీలో సభ్యుడిగా ఉన్న లాల్, “ఆలయ ప్రాంగణంలోనే మదర్సా కొనసాగుతుండటం వల్ల స్థానిక హిందూ కమిటీ సభ్యులు ఆ స్థలాన్ని సందర్శించడానికి కూడా భయపడుతున్నారు” అని పేర్కొన్నారు. 
 
ఈ ఘటనలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విషయాలు నిరసనకారుల వాదనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆ ఆలయం సుమారు 100 నుండి 125 ఏళ్ల నాటిదని, భారీ వర్షాల కారణంగా అది కూలిపోయిందని ఈటిపిబి  సీనియర్ అధికారి రాణా ఇఫ్తిఖార్ వార్తా సంస్థకు తెలిపారు. అయితే, ఏప్రిల్ 11 నాటి ఒక నివేదిక ప్రకారం, ఆలయానికి సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనలు, దానికి నష్టం వాటిల్లే అవకాశం గురించి స్థానిక పోలీసులకు ముందే తెలుసునని వెల్లడైంది. 
 
ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని మదర్సా ఏర్పాటు కోసం లీజుకు ఇచ్చారని ఇఫ్తిఖార్ అంగీకరించారు. “అయితే, ఆలయ భూమిని మాత్రం ఎవరికీ లీజుకు ఇవ్వలేదు,” అని ఆయన స్పష్టం చేశారు. ఆలయ పునరుద్ధరణ అంశంపై తమ శాఖకు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.