పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లు ఉపయోగిస్తున్న జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు

పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లు ఉపయోగిస్తున్న జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు

సాధారణ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాలపై నిఘా నుంచి తప్పించుకుంటూ, జమ్ముకశ్మీర్‌లోని రిక్రూట్‌లతో సంభాషించడానికి ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లు లైవ్‌ చాట్‌ సదుపాయం కలిగిన పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లు, ప్రత్యేక ఎన్‌క్రిప్టెడ్‌ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని భద్రతా అధికారులు తెలిపారు. కొన్ని పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లు సమీపంలోని వ్యక్తులను లేదా డేటింగ్‌ కోసం వ్యక్తులను కనుగొనేందుకు రియల్‌టైమ్‌ చాట్‌ ఫీచర్లను అందిస్తున్నాయి.

రిక్రూట్‌లలో మాట్లాడటానికి, వారికి ఆదేశాలు జారీ చేయడానికి, కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉగ్రవాద హ్యాండ్లర్లు ఈ సదుపాయాలను వాడుతున్నారు. ఎన్‌క్రిప్టెడ్‌ రిలే నెట్‌వర్క్‌ల ద్వారా డేటా ట్రాఫిక్‌ను మళ్లించి, వినియోగదారులను గుర్తించడాన్ని కష్టతరం చేసే కొన్ని ‘కోటెక్స్‌’, కొనియన్‌ వంటి టోర్‌ ఆధారిత మెసేజింగ్‌ యాప్‌లను భద్రతా సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. 

డేటింగ్ ముసుగులో చుట్టుపక్కల ఉన్న ఒంటరి వ్యక్తులను కనిపెట్టి, ఈ చాట్ రూమ్స్‌ ద్వారా హ్యాండ్లర్లు తమ అనుచరులకు ఆదేశాలు ఇస్తున్నట్లు తేల్చారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, జమ్మూ కాశ్మీర్‌లోని యువతను ఆకర్షణకు, తీవ్రవాదం వైపు మళ్లించడానికి ఈ పద్ధతిని వాడుతున్నట్లు అధికారులు నిర్ధరించారు.

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, సిగ్నల్ వంటి సాధారణ యాప్‌లను వాడకుండా, ఉగ్రవాదులు ప్రత్యేక డిజిటల్ టూల్స్‌పై ఆధారపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌క్రిప్టెడ్ నోడ్‌ల ద్వారా డేటాను పంపడానికి, వినియోగదారుల గుర్తింపులను దాచేందుకు కోటెక్స్, కోనియన్ వంటి టోర్-ఆధారిత మెసేజింగ్ అప్లికేషన్‌లపై ఆధారపడుతున్నట్లు తేల్చారు. 

ఈ డేటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు సర్వర్ల (నోడ్స్) ద్వారా ప్రయాణించడం వల్ల పంపినవారిని, అందుకున్నవారిని గుర్తించడం చాలా కష్టం. అయితే, భారత్‌లో ‘కోనియన్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలు లేదు. ఇలాంటి యాప్​లపై భారత్​లో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. వీటితో పాటు ఫ్రాన్స్‌కు చెందిన రహస్య యాప్​లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇది సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ను అనుమతిస్తుందని వివరించారు. తద్వారా వినియోగదారుని గుర్తించడం కష్టతరం అవుతుందని చెప్పారు. వియత్నాంకు చెందిన యాప్‌లతో పాటు మూన్‌చాట్ వంటి అనామక ప్లాట్‌ఫారమ్‌లను కూడా భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. 

ఇందులో సంప్రదాయ రిజిస్ట్రేషన్‌ను దాటవేసే, చైనా మూలాలతో ఉన్న పిజిపి-ఎన్‌క్రిప్టెడ్ వెర్షన్‌లు ఉన్నాయి. పోర్న్ అప్లికేషన్‌లో చాలా వరకు భారతదేశంలో నిషేధించినప్పటికీ, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (విపిఎన్) ఉపయోగించి వాటిని చట్టవిరుద్ధంగా డౌన్‌లోడ్ చేస్తున్నారు. దీనివల్ల ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామాలను మాస్క్ చేయడం, ఆన్‌లైన్ ట్రాఫిక్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా ఇంటర్నెట్‌లో సురక్షితమైన, ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్‌ను సృష్టిస్తుంది. ఫలితంగా ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేయడం, వారి డేటాను యాక్సెస్ చేయడం మరింత కష్టతరం అవుతుంది.