దశాబ్దాల నాటి గణిత సమస్యకు నీనా గుప్తా పరిష్కారం

దశాబ్దాలుగా గణిత శాస్త్రవేత్తలకు సవాలుగా నిలిచిన ఓ మ్యాథ‌మెటిక‌ల్ ప్రాబ్ల‌మ్‌కు పరిష్కారం చూపి అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ గణిత శాస్త్రవేత్త నీనా గుప్తాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘టైమ్‌ 100 నెక్స్ట్‌ ఇండియా-2026’ జాబితాలో ఆమె చోటు సంపాదించారు. వివిధ రంగాల్లో భవిష్యత్తును ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న వంద మంది వర్ధమాన నాయకులు, ప్రతిభావంతులతో ఈ జాబితాను రూపొందించారు. నవంబర్‌ 19న తొలిసారిగా ఈ జాబితాను ప్రకటించారు.

కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నీనా గుప్తా ఆల్జీబ్రా రంగంలోని కీలక విభాగాలైన కమ్యూటేటివ్‌ ఆల్జీబ్రా, అఫైన్‌ ఆల్జీబ్రెయిక్‌ జామెట్రీలో పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాలుగా పరిష్కారం కాని ‘జారిస్కీ క్యాన్సిలేషన్‌ ప్రాబ్లమ్‌’పై ఆమె చేసిన పరిశోధన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. గణిత శాస్త్రవేత్త ఆస్కార్‌ జారిస్కీ 1949లో ఈ సమస్యను ప్రతిపాదించారు. 

సులభంగా చెప్పాలంటే రెండు గణిత నిర్మాణాలకు అదనంగా ఒక వేరియబుల్‌ లేదా డైమెన్షన్‌ జోడించినప్పుడు అవి ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటే, అసలు నిర్మాణాలు కూడా ఒకేలా ఉండాలా? అన్నది ఈ సమస్యలోని ప్రధాన ప్రశ్న. ఈ అంశంపై దశాబ్దాలుగా పరిశోధనలు జరిగినప్పటికీ, కొన్ని సందర్భాల్లో దీనికి స్పష్టమైన సమాధానం లభించలేదు.

2014లో నీనా గుప్తా, గణిత శాస్త్రవేత్త టకనోరి అసనుమా అభివృద్ధి చేసిన ఓ గణిత నిర్మాణాన్ని ఉపయోగించి ఈ సమస్యకు సంబంధించి ప్రతివాద ఉదాహరణను రూపొందించారు. పాజిటివ్‌ క్యారెక్టరిస్టిక్‌ అనే గణిత పరిస్థితిలో క్యాన్సిలేషన్‌ లక్షణం అన్ని సందర్భాల్లోనూ వర్తించదని ఆమె నిరూపించారు. దీంతో ఆ పరిస్థితిలో జారిస్కీ సమస్యకు ప్రతికూల సమాధానం లభించినట్లయింది. ఈ పరిశోధన ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.

నీనా గుప్తా తన పరిశోధనలకు ఇప్పటికే 2019లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ప్రైజ్‌, 2021లో డీఎస్‌టీ-ఐసీటీపీ-ఐఎంయూ రామానుజన్‌ ప్రైజ్‌ అందుకున్నారు. 2021 సంవత్సరానికి ప్రకటించిన నారీ శక్తి పురస్కారాన్ని 2022లో స్వీకరించారు. 2024లో మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ విభాగంలో ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ ఆమెను వరించింది. 2025లో ప్రతిష్ఠాత్మక ఎమ్మీ నోయెథర్‌ లెక్చర్‌ ఇచ్చేందుకు కూడా ఆమె ఎంపికయ్యారు.

కోల్‌కతాలోని బెతూన్‌ కాలేజీలో 2006లో గణితశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన నీనా గుప్తా, 2008లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. అదే సంస్థలో ప్రొఫెసర్‌ అమర్త్య కుమార్‌ దత్తా మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఐఎస్‌ఐలోని థియరిటికల్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌ యూనిట్‌లో ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు.

టైమ్‌ 100 నెక్స్ట్‌ ఇండియా జాబితా ద్వారా సైన్స్‌, టెక్నాలజీ, వ్యాపారం, వినోదం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో ప్రతిభ చూపుతున్న భారతీయులు, ప్రవాస భారతీయులను గుర్తిస్తున్నారు.   ఈ ఏడాది జాబితాలో వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ జర్నలిస్ట్‌ రితికా చోప్రా, నటి ఆలియా భట్‌, క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దర్శకుడు ఆర్యన్‌ ఖాన్‌, వ్యాపారవేత్త పీయూష్‌ బన్సాల్‌ తదితరులు కూడా చోటు సంపాదించారు. గణిత పరిశోధనలో నీనా గుప్తా సాధించిన విజయానికి ఈ గుర్తింపు మరో అంతర్జాతీయ మైలురాయిగా నిలిచింది.

About The Author