బంగ్లాదేశ్‌లోని వాయువ్య రంగపూర్‌లో జరిగిన మారణకాండపై పోలీసుల వివరణపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఒక హిందూ కుటుంబ హత్యపై న్యాయ విచారణ జరపాలని ఒక పౌర సమాజ సంస్థ డిమాండ్ చేసింది. ఆ కుటుంబ హత్యపై పోలీసుల వివరణను ప్రముఖ హక్కుల సంఘం ఐన్ ఓ శాలిష్ కేంద్ర (అస్క్), మైనారిటీ హక్కుల సంఘం హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ప్రశ్నించిన రెండు రోజుల తర్వాత, రంగపూర్ సిటీ సివిక్ సొసైటీ (ఆర్ సిసిఎస్) ఈ డిమాండ్‌ను చేసింది.
విశ్రాంత హిందూ పాఠశాల ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), అతని భార్య ప్రీతిలత చక్రవర్తి (50), వారి పిల్లలు అగామి చక్రవర్తి ప్రార్థి (23), ప్రియం చక్రవర్తి (12)ల కుళ్ళిన మృతదేహాలు ఆగస్టు 22న రంగపూర్‌లోని వారి తాళం వేసిన ఇంట్లో లభ్యమయ్యాయి. ఈ హత్యలలో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై పోలీసులు ముగ్ధో, సిద్ధార్థ అనే ఇద్దరు కజిన్‌లను అదుపులోకి తీసుకున్నారు.
ఒక పత్రికా సమావేశంలో చదివి వినిపించిన ప్రకటనలో రంగపూర్ సిటీ సివిక్ సొసైటీ ఇలా పేర్కొంది: “ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన తర్వాత, ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యుల హత్యలపై మీడియాలో పోలీసులు చేసిన వ్యాఖ్యలు, పోలీసుల చర్యలపై ప్రజలకు నమ్మకం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తూ, వారి మనస్సులలో సందేహాలను, ప్రశ్నలను రేకెత్తించాయి.”
హత్యకు గురైన కుటుంబ బంధువుల వ్యాఖ్యలు, నేరస్థలంలోని పరిస్థితులు, ఫోరెన్సిక్ నిపుణుల వాదనలకు విరుద్ధంగా ఉన్న, ఆ తర్వాత పోలీసులు ఇచ్చిన రెండు ప్రకటనలకు సంబంధించి తాము 19 ప్రశ్నలను గుర్తించినట్లు బృందం తెలిపింది. కుటుంబ హత్యపై పోలీసులు చెప్పిన వివరాల చుట్టూ `అస్క్’ బృందం కూడా దాదాపుగా అవే ప్రశ్నలను లేవనెత్తింది.
ఈ సందేహాలను నిరాధారమైనవిగా లేదా తప్పుదోవ పట్టించేవిగా కొట్టిపారేయకూడదని పేర్కొంది. “హత్యల ఉద్దేశం, కాలక్రమం, పద్ధతి, తెల్లవారుజామున 2:40 గంటలకు వచ్చిన అసాధారణ ఫోన్ కాల్, అనుమానితుల ఉనికికి సంబంధించి పోలీసుల వాదనలకు అనుగుణంగా ఏవైనా ఫోరెన్సిక్,డిజిటల్ ఆధారాలు లభించాయో లేదో స్పష్టం చేయడం చాలా కీలకం,” అని `అస్క్’ గురువారం నాడు పేర్కొంది.
ఒక మైనారిటీ సంస్థ కూడా ఈ హత్యలపై ప్రశ్నలు లేవనెత్తింది. “మేము పరిణామాలను గమనిస్తున్నాము. కానీ, మాదకద్రవ్యాలకు బానిసలైన ఇద్దరు వ్యక్తులు నలుగురిని ఎలా హత్య చేయగలిగారు? అలాగే ఆ ఇంటిని అంత పకడ్బందీగా దోపిడీ జరిగిన ప్రదేశంలా ఎలా మార్చగలిగారు? అనేది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది,” అని మైనారిటీ హక్కుల సంఘమైన హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి నాయకుడు ప్రశ్నించారు.
ఆగస్టు 23న జరిగిన మొదటి సమావేశంలో, చక్రవర్తిని తన ఇంటి పైకప్పుపైన, అతని భార్య, కుమార్తెను రెండవ అంతస్తు మెట్ల మార్గంలో, అలాగే అతని కుమారుడిని ఇంటి లోపల నిద్రిస్తున్నప్పుడు హత్య చేశారని పోలీసులు తెలిపారని ఆ సంస్థ పేర్కొంది. ఆగస్టు 27న జరిగిన రెండవ సమావేశంలో నేర స్థలాలకు సంబంధించిన వివరాలు మారాయని, ఆ ఉపాధ్యాయుడు, అతని భార్య, కుమార్తె ముగ్గురూ బహిరంగ పైకప్పుపైన హత్యకు గురయ్యారని తెలిపిందని విస్మయం వ్యక్తం చేశారు.
పొరుగున ఉన్న ఇళ్లకు కనిపించకుండా ఉండేందుకు, తల్లి, కుమార్తె మృతదేహాలను ఆ తర్వాత పైకప్పు ద్వారం వద్ద ఉన్న మెట్ల మార్గంలోకి తరలించారని రంగపూర్ కమిషనర్ అబ్దుల్ మబుద్ తన రెండవ సమావేశంలో చెప్పారు. అరెస్టు అయిన ఆ ఇద్దరు వ్యక్తులు పొరుగున ఉన్న భవనం ద్వారా చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి ప్రవేశించి, గురువారం రాత్రి అక్కడ ‘యాబా’ అనే మాదకద్రవ్యాన్ని సేవించారని కమిషనర్ మబుద్ తెలిపారు.
“యాబా (మాదకద్రవ్యం) వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినందుకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు హత్యకు గురికావడం అనేది ఎంతవరకు సాధారణమైన విషయం అనే కోణంలో దర్యాప్తు జరగాలి,” అని ఆ సంస్థ సభ్య-కార్యదర్శి పలాష్ కాంతి నాగ్ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

More Stories
కాశ్మీరీ పండిట్లకు బెదిరింపు లేఖలపై రాష్ట్రపతికి బహిరంగ లేఖ
రహస్యంగా ‘డార్క్ షిప్’ ద్వారా రష్యాకు భారత ఇంధనం
దీర్ఘకాలిక యురేనియం సరఫరాకు భారత్, ఉజ్బెకిస్థాన్ అంగీకారం