భారత్‌లోని వివిధ జాతి, మత వర్గాలపై వివక్ష, హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఐక్యరాజ్యసమితికి (ఐరాస) చెందిన ఓ కమిటీ చేసిన వ్యాఖ్యల్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఐరాసకు చెందిన కమిటీ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ (యుఎన్ సీఈఆర్డి- వర్ణ వివక్ష నిర్మూలనా కమిటీ) చేసిన ఆరోపణల్ని పూర్తి స్థాయిలో తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.
ఐరాస కమిటీ తన నివేదికలో భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సి), రోహింగ్యా శరణార్థులు ముఖ్యంగా పౌరసత్వం లేని వ్యక్తులపై పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుతన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే భారత్‌లో ద్వేషపూరిత నేరాలు పాల్పడుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
బెంగాలీ మాట్లాడే ముస్లింలపై ఘటనలు పెరిగాయని పేర్కొంటూ, వాటికి బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఐరాస కమిటీ విడుదల చేసిన రిపోర్టులోని కొన్ని అంశాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో, తప్పుడు కోణంలో రూపొందించిన కమిటీ రిపోర్టు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం రోజు మీడియాతో మాట్లాడుతూ జాతి వివక్షను ఎదుర్కోవడంలో భారతదేశ నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.’ఈ నివేదికలోని దురుద్దేశపూర్వక, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యల్ని, ఆరోపణల్ని భారత్ పూర్తిగా తిరస్కరిస్తోంది. జాతి వివక్షకు వ్యతిరేకంగా భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంది. దానిని అణచివేసే చర్యల్లో కూడా ఎప్పటికీ వెనుకడుగు వేయదు.’ అని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి సమీక్షా సమావేశంలోనే భారతదేశం తన రాజ్యాంగ రక్షణలు, బలమైన చట్టపరమైన వ్యవస్థ, విభిన్న సంస్కృతుల సమ్మేళనం, వెనుకబడిన వర్గాల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని స్పష్టంగా వివరించినట్లు జైస్వాల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా నేతృత్వంలోని భారత ఉమ్మడి మంత్రిత్వ శాఖల ప్రతినిధి బృందం ఇదివరకే ఈ ఆధారాల్లేని ఆరోపణలు, కమిటీ పరిధి దాటి చేసిన వ్యాఖ్యల్ని తిరస్కరించిందని ఆయన గుర్తుచేశారు.
ఐరాస కమిటీ సమీక్ష ఆగస్ట్ 11, 12 తేదీల్లో జెనీవాలో జరిగింది. ఇందులో భారత్ సమర్పించిన 12వ, 21వ సంయుక్త నివేదికల్ని పరిశీలించారు. ఈ నివేదికల్ని భారత్ 2023లో సమర్పించింది. ఆ సమీక్షలో జాతి వివక్ష నిర్మూలనకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం అమలుకు సంబంధించిన పరిపాలనా చర్యలు, అణగారిన వర్గాల్లో సాధించిన పురోగతి, పక్షపాతం ఎదుర్కొనేందుకు చేపట్టిన విధానపర చర్యలు వంటి అంశాలు చర్చించారు.

More Stories
భగవత్ కార్యక్రమం వ్యతిరేకించిన మేయర్ పై సింగర్ మండిపాటు
భగవత్ పర్యటన పట్ల న్యూయార్క్ మేయర్ వైఖరి సంకుచితం!
రాడార్కు దొరకని టెక్నాలజీతో చైనా యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి