గల్వాన్ ఘర్షణ అనంతరం తొలిసారి జిన్‌పింగ్ భారత్ పర్యటన

గల్వాన్ ఘర్షణ అనంతరం తొలిసారి జిన్‌పింగ్ భారత్ పర్యటన
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చే నెల న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం ఉందని రాయిటర్స్‌ కథనాన్ని ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించాయి. ఈ పర్యటన ఖరారైతే 7 ఏళ్ల తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కానుంది. సెప్టెంబర్‌ 12, 13వ తేదీల్లో బ్రిక్స్‌ సదస్సు జరగనున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ సుమారు 400 మంది అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. 
 
2019లో జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు 200 మందిలోపు ప్రతినిధులు ఆయన వెంట ఉన్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ కథనం పేర్కొంది. చైనా అధికారులు ఇప్పటికే భారత్‌లో హోటళ్లు, భద్రతా ఏర్పాట్లను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు ఓ భారతీయ అధికారి వెల్లడించినట్లు నివేదిక తెలిపింది. అయితే జిన్‌పింగ్‌ పర్యటనపై తుది నిర్ణయం, ఆయన పర్యటన షెడ్యూల్‌, ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. 
 
జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు సంబంధించిన వార్తలు వెలువడుతున్న సమయంలోనే భారత్‌, చైనా మధ్య ఉన్నతస్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్‌ జెంగ్‌తో ఆయన భేటీ అయి సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. 
 
చైనా విదేశాంగ మంత్రితో సైతం అజిత్‌ దోవల్‌ ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొంటున్నారు. భారత్‌-చైనా సరిహద్దు వివాదంతో పాటు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఈ చర్చలు సాగుతున్నాయి. 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణతో భారత్‌-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించారు. 
 
అనంతరం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరుదేశాల సైన్యాల మధ్య సుదీర్ఘ ప్రతిష్టంభన కొనసాగింది. అయితే 2024లో సైనిక ఉపసంహరణకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల పునరుద్ధరణ, కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌ న్యూఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీతో భేటీ అయితే.. భారత్‌-చైనా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అది కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది. అయితే పర్యటనకు సంబంధించి చైనా అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.