ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌కు అయోధ్యలో స్వాగత కార్యక్రమం సందర్భంగా చేపల విందు ఏర్పాటు చేయడం దుమారం రేపింది. పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ విందు ఏర్పాటును స్థానిక మత పెద్దలు వ్యతిరేకించడంతో వివాదం తలెత్తింది. అయితే ప్రతి వ్యక్తికి తమ ఇష్టానుసారం ఆహారం తినే రాజ్యాంగ హక్కు ఉందని పార్టీ నేత సమర్థించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆదివారం అయోధ్యలో పర్యటించారు. శ్రీ రామ్ జన్మభూమి ఆలయాన్ని, హనుమాన్ గర్హిని సందర్శించారు. హనుమాన్ గర్హిలో హనుమాన్ చాలీసా కూడా ఆయన పఠించారు. ఆ తర్వాత తరుణ్‌లో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో అజయ్ రాయ్ పాల్గొన్నారు. ఇటీవల బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో రామ్ నిహాల్ నిషాద్ ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ విందు కోసం చేపల కూర తయారీకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో చేపల విందు ఏర్పాటు చేయడంపై కొందరు స్థానిక సాధువులు, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేత రామ్ నిహాల్ నిషాద్ దీనిని సమర్థించుకున్నారు.
రాజ్యాంగం ప్రకారం తమకు నచ్చిన ఆహారాన్ని తినడం అనేది ప్రతి వ్యక్తి హక్కు అని తెలిపారు. చేపలు పట్టడం, చేపలు తినడం తమ సంప్రదాయ ఆచారాలలో భాగమని ఆయన చెప్పారు. శ్రావణ మాసం, భాద్రపద మాసం లేదా మరే ఇతర మాసం అనే ప్రాతిపదికన ఒక వ్యక్తి ఆహార ఎంపికలను ప్రశ్నించకూడదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన చేపల విందుపై వివాదం చెలరేగడం చర్చనీయాంశమైంది.
కాగా, కాంగ్రెస్ నాయకులకు హిందూ సమాజపు మనోభావాల పట్ల ఏమాత్రం పట్టింపు లేదని బీజేపీ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు కమలేష్ శ్రీవాస్తవ విమర్శించారు. శ్రావణ మాసంలో చేపల విందు నిర్వహించడం కేవలం భోజన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది సనాతన సంప్రదాయాలను, లక్షలాది భక్తుల మనోభావాలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. అయోధ్యలో ఏ మనస్తత్వంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందో కాంగ్రెస్ స్పష్టం చేయాలని కోరారు.

More Stories
ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయం సెప్టెంబర్‌లో ప్రారంభం
తారిఖ్ రెహమాన్‌పై ఇస్లామిక్ వాదుల ఒత్తిడి.. ఉగ్రవాదుల ప్రభావం
‘ఛాత్రోన్ కి గూంజ్’లో రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి నేతల మండిపాటు