బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ ఎటు అడుగులు వేయాలో తెలియక సతమతమవుతున్నారు. చైనాతో జతకట్టమని ఆయనకు ఇస్లామిక్ దేశాలే కాకుండా అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. పాకిస్తాన్‌ను అమెరికా ఎలాగైతే వలలో వేసుకున్నదో బంగ్లాదేశ్‌ను తన వైపునకు తిప్పుకోవాలని చూస్తున్నది. అయితే, యుద్ధంతో అమెరికా అప్రదిష్ట పాలైంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రపంచంలో ఏ దేశమూ నమ్మే స్థితిలో లేదు. రెహమాన్ అధికారాన్ని చేపట్టిన వెంటనే భారత్ వైపు అడుగులు వేయనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఆయన భారత్‌లో పర్యటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇస్లామిక్ వాదుల ఒత్తిడితో ఆయన వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో అయితే, ఆయనను చైనా, అమెరికాలు వెనక్కి లాగినట్టుగా కనిపిస్తుంది.
పాకిస్తాన్ పాత్ర సరేసరి. ఉపఖండంలో మరో ఇస్లామిక్ దేశం ఉండాలన్నది పాకిస్తాన్ అభిమతం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఒత్తిడి తెచ్చి బంగ్లాదేశ్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా చేయాలని అక్కడి జమాత్ ఇస్లామ్ వంటి పార్టీలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే తారిఖ్ రెహమాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయనపైన కూడా జమాత్ ఇస్లామ్ ఒత్తిడి తెచ్చింది.
బంగ్లాలో 90 శాతం ముస్లింలు ఉన్నారనీ, వారంతా ఇస్లామిక్ రిపబ్లిక్‌గా బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారని జమాత్ పార్టీయే కాకుండా, తారీఖ్ రెహమాన్ తల్లి బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ నాయకులు కూడా ఒత్తిడి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు 8 శాతం మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఆయన ఎటువైపు తేల్చుకోలేకపోతున్నారు.
ఇస్లామిక్ వాదులు ఇప్పుడు బంగ్లాదేశ్ రాజ్యాంగంలో మార్పులు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిజం అనే పదాలను తొలగించాలని పట్టుపడుతున్నారు. షేక్ హసీనాను గద్దెదింపిన తర్వాత ఇస్లామిక్ వాదులు హిందువులపైనా, హిందువుల ఆలయాలపైనా దాడులు చేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ సవరణలు ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా ఉన్నాయనీ, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని అటార్నీ జనరల్ వాదించారు.
ఆ ప్రయత్నంలో భాగంగానే రాజ్యాంగంలో ఈ రెండు పదాలను తొలగించాలని అనుకుంటున్నట్టు కోర్టుకు తెలియజేసింది. అలా చేయరాదని ఇతర వర్గాలు కోరుతున్నాయి. దాంతో ప్రధాని రెహమాన్ రెండు వర్గాల మధ్య నలిగిపోతున్నారు. మరోవంక, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన అల్-ఖైదా, ఐఎస్ఐఎల్ పర్యవేక్షణ బృందం 38వ నివేదికలో, బంగ్లాదేశ్‌లో తన ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నిర్మించుకోవడానికి అల్-ఖైదా, ఐఎస్ “ప్రస్తుత పరిస్థితులను తీవ్రంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోందని” తెలియజేసింది.
అందులోని భాష కచ్చితమైనది, అంచనా ఆందోళనకరమైనది. నివేదికల ప్రకారం బంగ్లాదేశ్‌లో 1,611 మంది మిలిటెంట్లు చురుకుగా ఉన్నారు. ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అభియోగాలు మోపిన 370 మందికి పైగా వ్యక్తులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఏక్యూఐఎస్, భారత ఉపఖండం అంతటా తన ఆర్థిక, లాజిస్టికల్ పరిధిని విస్తరించడానికి బంగ్లాదేశ్‌ను ఉపయోగించుకుంటూ, “బలమైన ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలుగా” రూపాంతరం చెందుతోందని ఆ నివేదిక పేర్కొంది.
జమాత్-ఎ-ఇస్లామీ తాజా ఎన్నికలలో సుమారు మూడింట ఒక వంతు ఓట్లను సాధించి, ఆధిపత్య ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కోర్టుల నుండి సైనిక అకాడమీల వరకు ప్రతి సంస్థలో దీనికి బలమైన ఉనికి ఉంది. రెహమాన్‌కు జమాత్, దాని మిత్రపక్షాలు సమీకరించే ఇస్లామిస్ట్ వర్గాలు అవసరం ఉంది. దానితో ఆ నెట్‌వర్క్‌లు, ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్న సంస్థలతో కొన్నిసార్లు చాలా దగ్గరగా, అవి వ్యాప్తి చెందుతున్నాయి. .
సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీల మధ్య ఇటీవల ఏర్పడిన రక్షణ కూటమిలో చేరమని వత్తిడులు కూడా రెహమాన్ ఎదుర్కొంటున్నారు. అందుకు బంగ్లాదేశ్ సుముఖంగా ఉందని ఇద్దరు జూనియర్ మంత్రులు ప్రకటిస్తూ ఏ నిర్ణయమైనా దేశ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటుందని వారు నొక్కి చెప్పారు. ఆగస్టు 7న మక్కాలో సంతకాలు చేసిన ఈ ఒప్పందం, సామూహిక నిరోధకానికి ఒక చట్రాన్ని ఏర్పాటు చేస్తుంది.

More Stories
ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయం సెప్టెంబర్‌లో ప్రారంభం
‘ఛాత్రోన్ కి గూంజ్’లో రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి నేతల మండిపాటు
అయోధ్యలో కాంగ్రెస్ `చేపల విందు’ ఏర్పాటుపై దుమారం