జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టుచేసింది. ఆదివారం హైదరాబాద్ కొండాపూర్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకుని బషీర్‌బాగ్‌లోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించింది.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సంబంధించిన మద్యం రవాణా టెండర్లలో రూ.400 కోట్ల మేర దోపిడీ జరిగిందని, అస్మదీయ సంస్థలకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు మార్చి, సబ్‌కాంట్రాక్టుల ద్వారా భారీ మొత్తంలో అక్రమ లాభాలు పొందారని రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. ఇందులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రూ.195 కోట్ల లావాదేవీలను కనుగొన్నారు.
ఈ ఏడాది జూన్ 18న కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్‌ను అరెస్టుచేశారు. అంతకుముందే అదే నెల 11న బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, మద్యం స్కాం కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో గుర్తించిన రూ.37.7 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కారుమూరి నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
జగన్ హయాంలో వైసీపీ నేతలు మద్యం సరఫరా కాంట్రాక్టును జిల్లాలు, ప్రాంతాల వారీగా దక్కించుకుని భారీ దోపిడీకి తెరతీశారు. జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి ‘సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్’ పేరుతో ముసుగు సంస్థను హడావుడిగా నెలకొల్పి దానికి ప్రధాన కాంట్రాక్టు దక్కేలా నిబంధనలు మార్చారు. మద్యం రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 96 శాతం నిధులు లిక్కర్ సిండికేట్ ఖాతాల్లోకి వెళ్లగా, సిగ్మా కేవలం 4 శాతమే తీసుకుంది.
ఆ 96 శాతం నిధుల నుంచి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన శ్రీ సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ ఖాతాల్లోకి రూ.68 కోట్లు, మాజీ మంత్రికి నగదు, బ్యాంకు ఖాతాల ద్వారా రూ.15 కోట్లు, ఆయన కోడలు కీర్తి బ్యాంకు ఖాతాల్లోకి రూ.9.5 కోట్లు, కుమారుడు సునీల్ ఖాతాల్లోకి సైతం నిధులు చేరినట్లు ఈడీ గుర్తించింది. సునీల్‌ను అరెస్టు చేసి జూన్ 24న విచారణకు రావాలని నాగేశ్వరరావుకు నోటీసు ఇచ్చింది.
అయితే అనారోగ్య కారణాలు చూపి గైర్హాజరైన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఊరట లభించలేదు. కొన్ని రోజులుగా నిఘా పెట్టిన ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇతర నిందితులుగా వాసుదేవరెడ్డి బావమరిది విజయ్‌నరసింహారెడ్డి, కారుమూరి కోడలు వల్లూరి కీర్తి, కసిరెడ్డి గ్యాంగ్‌లోని సైఫ్ అహ్మద్, బూనేటి చాణక్య ఉన్నారు.

More Stories
అమరావతి నుండి ఖరగ్‌పుర్ హైస్పీడ్ రోడ్ కారిడార్
ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ రూ 24 లక్షలు జప్తు
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ