`శుద్ధి’ వివాదంపై కాంగ్రెస్ నేతల ‘మౌనం’ పట్ల ఖర్గే ‘వేదన’

`శుద్ధి’ వివాదంపై కాంగ్రెస్ నేతల ‘మౌనం’ పట్ల ఖర్గే ‘వేదన’
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో తన సభ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోని పలువురు నేతలు బహిరంగంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.
ఈనెల‌ 8న హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఖర్గే ‘విజయ్‌ శంఖనాద’ సభలో పాల్గొన్నారు. రెండు రోజుల తర్వాత ఆగస్టు 10న ‘శ్రీరామ్‌ సేన’ కు చెందిన కార్యకర్తలు అక్కడ శుద్ధి హోమం నిర్వహించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో బుధవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఘటన జరిగిన తర్వాత పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదని ఆయన బాధపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే ఖర్గే ఎవరినీ ప్రత్యేకంగా పేరుపెట్టి విమర్శించలేదని సమాచారం. కొందరు సీనియర్‌ నేతలు ఈ ఘటనపై గట్టిగా స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమావేశంలో వ్యవహరించిన తీరును బట్టి తెలుస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాన్ని ఖర్గే గురువారం రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. హల్ద్వానీలో తన సభ వేదికను శుద్ధి చేయడం తనను అవమానించినట్లుగా అనిపించిందని పేర్కొన్నారు. 

త‌న‌ను రక్షించండి అని ఎవరినీ అడగలేదని, త‌న‌కు పోరాడే శక్తి ఉందని, పోరాడుతూనే ఉంటానని అంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కానీ హల్ద్వానీలో వేదికను శుద్ధి చేయడంవల్ల తాను అంటరానితనం బాధను అనుభవించానని ఖర్గే పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. హల్ద్వానీ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ  ఈ ఘటనతో బీజేపీ నేతలు, కార్యకర్తలకు సంబంధం లేదని చెప్పారు. దీనిపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.  మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించిన వారికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ ఘటన వెనుక దళితులపట్ల వివక్షతో కూడిన ఆలోచనా ధోరణి ఉందని విమర్శించింది. బీజేపీ మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటూ శుద్ధీకరణ చర్యను ఖండించింది.

ఇదే సమయంలో, ఖర్గేకు ప్రతిపక్ష నాయకుల నుంచి మద్దతు లభించింది.  బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ విషయంలో పోలీసు చర్య తీసుకోవాలని కోరారు. “ఈ వ్యవహారం తీవ్రంగా ఖండించదగినది.  ఎంతో ఆందోళనకరమైనది” అని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.