హోర్ముజ్ జలసంధి “ఇరాన్‌దే, ఇప్పటికీ ఇరాన్‌దే, ఇకముందూ ఇరాన్‌దే” అని టెహ్రాన్ శనివారం ప్రకటించింది. కీలకమైన ఇంధన రవాణా మార్గమైన ఈ జలసంధిని త్వరలోనే అమెరికా భూభాగంలో భాగంగా ప్రకటిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభంలో టెహ్రాన్ వాస్తవానికి మూసివేసిన ఈ జలసంధి, “కేవలం ఇరాన్ ఆదేశాల మేరకే మూసివేయబడుతుంది, తెరవబడుతుంది” అని ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి కాజెమ్ ఘరీబాబాది నొక్కి చెప్పారు.
“ఇరాన్ ఓటమి తర్వాత హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ అన్నారు. ట్వీట్ ద్వారా గానీ, విమాన వాహక నౌక ద్వారా గానీ, ఉత్తర్వు జారీ చేయడం ద్వారా గానీ లేదా ఎన్నికల ప్రసంగం ద్వారా గానీ హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు,” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
యుద్ధ నౌకల మోహరింపు ద్వారా జలసంధిని స్వాధీనం చేసుకోలేరని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అగ్రరాజ్యం తన భ్రమలను విడిచిపెట్టి, ఓటమిని అంగీకరించే వరకు హర్మూజ్‌పై ఇరాన్ దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తాము బెదిరింపులకు భయపడబోమని, సైనిక ప్రదర్శనలకు లొంగబోమని తేల్చి చెప్పారు. హర్మూజ్ ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చెబుతున్న మాటల్లో నిజం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.
“వాస్తవాన్ని ఒక్కసారిగా అంగీకరించండి: ఇప్పటివరకు మీరు వ్యూహాత్మకమైన, భారీ ఓటములను చవిచూశారు. ఓటమి వాస్తవాన్ని అంగీకరించి, మీ అవాస్తవిక భ్రమలను వీడేంత వరకు, ఇరాన్ తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది,” అని ఆయన జోడించారు. అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గమైన ఈ జలసంధిని అమెరికా భూభాగంలో భాగంగా ప్రకటిస్తానని, అలాగే ఇరాన్‌ను పూర్తిగా ఓడిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే ఆయన ఈ విధంగా స్పందించారు.
“ఇరాన్ ఇప్పటికే తీవ్రమైన ఓటమిని ఎదుర్కొంటోంది, ఆ ప్రక్రియ పూర్తయ్యాక త్వరలోనే నేను హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించబోతున్నాను,” అని న్యూయార్క్‌లోని ఒక పోలీస్ అకాడమీలో జరిగిన రాజకీయ ర్యాలీలో ఆయన నవ్వుతూ పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిపై అమెరికాకు “పూర్తి నియంత్రణ” ఉందని డొనాల్డ్ ట్రంప్ బుధవారం పేర్కొన్నారు. “దీన్ని మనమే ఉంచుకుంటామని నేను భావిస్తున్నాను,” అని ఆయన ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌లో పెక్రోన్నారు. “మా నౌకాదళ దిగ్బంధనాన్ని అందరూ ‘ఉక్కు గోడ’ అని పిలుస్తున్నారు, దీని విషయంలో ఇరాన్ ఏమీ చేయలేదు,” అని ఆయన జోడించారు.

More Stories
బంగ్లా ప్రధాని రహమాన్ భారత్ పర్యటనపై దౌత్య చర్చలు
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రత, 38 మంది మృతి
భారత్ రావాలంటే హసీనాను అప్పగించాలి.. బంగ్లా ప్రధాని షరతు!