దేశ రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలపై భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఒక ఉన్నతాధికారి చిక్కుకున్నారు. ఐఏఎఫ్‌లో వింగ్ కమాండర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ గూఢచార సంస్థలకు సహకరిస్తున్న ఒక మహిళతో కలిసి దేశ భద్రతకు భంగం కలిగించేలా కుట్ర పన్నుతున్నారనే నమ్మదగిన సమాచారం అందడంతో అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం బాధితుడైన వింగ్ కమాండర్ వ్యక్తిగత సమస్యలతో మానసిక ఒత్తిడిలో ఉన్న సమయంలో సదరు మహిళ అతడికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. అతడి బలహీనతలను ఆసరాగా చేసుకుని స్నేహం పేరుతో మెల్లగా వలపు వల విసిరింది. ఆ తర్వాత నెమ్మదిగా అతడి ఫోన్‌లోకి ఒక రహస్య యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్పింది.
ఇందుకోసం ఆ అధికారి వేరే మొబైల్ ఉపయోగించాడు. ఈ యాప్ ఇక్కడి డాటా సేకరణకు ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో మొబైల్ ద్వారా ఏం మాట్లాడుతున్నారో నిరంతరం వినే వీలుంటుంది. ఈ రహస్య యాప్ పనితీరు గురించి, ఇంకా పూర్తి వివరాలు తెలియదు. మరోవైపు ఐఏఎఫ్ అధికారికి బాగా దగ్గరైన ఆ మహిళతో అతడు రెగ్యులర్ చాటింగ్ చేసేవాడు.
నమ్మకం కుదిరిన తర్వాత భారత సైనిక కదలికలు, సరిహద్దుల్లో దళాల మోహరింపులకు సంబంధించిన అత్యంత సున్నితమైన వివరాలతో పాటు ఫోటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ పత్రాలను పంపాలని ఆ మహిళ ఒత్తిడి తెచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా సదరు అధికారి ఆ మహిళ మాయలో పడి డిజిటల్ మాధ్యమాల ద్వారా అత్యంత రహస్యమైన సైనిక పత్రాలను, డేటాను ఆమెకు చేరవేశారు.
ఈ విషయంపై నిఘా ఉంచిన ఐఏఎఫ్ ఉన్నతాధికారులు అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో గత మే 30న ఆ ఐఏఎఫ్ అధికారిని ఢిల్లీ పోలీసులు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. జుడీషియల్ కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. అతడు ఆమెకు ఏ సమాచారం చేరవేశారు వంటి వివరాల్ని పోలీసులు సేకరించారు. అలాగే, చాటింగ్, వీడియో కాల్స్, వీడియోలు, ఫొటోల్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక విచారణ పూర్తైంది. దీంతో జూలై 30న చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో కేసు విచారణ సాగుతోంది.

More Stories
సింధు జలాలపై లడఖ్‌లో మొదటి రాతి చెక్ డ్యామ్
రామ భక్తుల మద్దతే ప్రధాన బలం
బెంగాల్ ప్రతిపక్ష నేత లైంగిక దాడి ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశం