వందేభార‌త్ రైలు, చీనాబ్ బ్రిడ్జ్‌లపై సోన‌మ్ వాంగ్‌చుక్ ప్ర‌శంస‌లు

వందేభార‌త్ రైలు, చీనాబ్ బ్రిడ్జ్‌లపై సోన‌మ్ వాంగ్‌చుక్ ప్ర‌శంస‌లు

సామాజిక కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్‌చుక్ గురువారం వందేభార‌త్ రైలులో ప్ర‌యాణించారు. ఢిల్లీలో నుంచి ల‌డాఖ్‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న ఆ రైలులో ప్ర‌యాణించారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఇంకా ఇటీవ‌ల శ్రీన‌గ‌ర్ స‌మీపంలో నిర్మించిన చీనాబ్ బ్రిడ్జ్‌ను కూడా ఆయ‌న తిల‌కించారు.  వందేభార‌త్ రైలుతో పాటు చీనాబ్ బ్రిడ్జ్ కూడా బాగున్న‌ట్లు సోన‌మ్ వాంగ్‌చుక్ త‌న వీడియోలో ప్ర‌శంసించారు. 

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్‌లో సీజేపీకి మ‌ద్ద‌తుగా ఆయ‌న 26 రోజుల పాటు నిరాహారీ దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. సీజేపీ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్య‌కర్త‌ల‌పై త‌మ‌కు హామీ ఇచ్చిన‌ట్లు కేసులు న‌మోదు చేయ‌రాదని ఆయ‌న కోరారు. ఆ దీక్ష తర్వాత ఢిల్లీ నుంచి క‌శ్మీర్‌కు రైలులో వెళ్లిన ఆయ‌న‌  చీనాబ్ బ్రిడ్జ్ ఇంజినీరింగ్ ఫీట్‌ను చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. 

అద్భుత‌మైన రీతిలో ఆ బ్రిడ్జ్‌ను నిర్మించిన‌ట్లు పేర్కొన్నారు.  రైలు ప్ర‌యాణం అనేది త‌న‌కు ఇష్ట‌మైంద‌ని, చీనాబ్ బ్రిడ్జ్‌ను కూడా చూడాల‌నుకున్నాన‌ని, ఇదో అద్భుత‌మైన అనుభ‌వం అని పేర్కొంటూ “రైలు ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. నేను చీనాబ్ వంతెనను కూడా చూడాలనుకున్నాను. అది చాలా అద్భుతమైన అనుభవం. భారతీయ రైల్వేల పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది,” అని వాంగ్‌చుక్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

పేప‌ర్ లీకేజీల నిరోధ‌క బిల్లును పార్ల‌మెంట్ ఆమోదించడం ప‌ట్ల వాంగ్‌చుక్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  కేవ‌లం ప‌రీక్షల అంశంలో మాత్ర‌మే కాకుండా, యావ‌త్ విద్యా వ్య‌వ‌స్థ మార్పుకు శ్రీకారం చుట్టాల‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. “పరీక్షా విధానాన్ని మెరుగుపరిచేందుకు పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయం. ఈ మార్పు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా, మొత్తం విద్యా వ్యవస్థ అంతటా అమలు కావాలని నేను ఆశిస్తున్నాను,” అని ఆయన తెలిపారు.

విద్యార్థుల‌పై ఎటువంటి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని ఆయ‌న వేడుకున్నారు. ప్రభుత్వం, విద్యార్థి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లునమోదు చేయవద్దని వాంగ్‌చుక్ అధికారులను కోరారు.  “నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన లిఖితపూర్వక హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ముఖ్యంగా యువతరంతో విశ్వాసపూరిత వాతావరణాన్ని నెలకొల్పాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను,” అని ఆయన పేర్కొన్నారు.