నీట్ లీక్ లో ఎన్టీఎ నిపుణులు, కోచింగ్ సిబ్బంది, దళారుల సిండికేట్‌

నీట్ లీక్ లో ఎన్టీఎ నిపుణులు, కోచింగ్ సిబ్బంది, దళారుల సిండికేట్‌

* నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు

 నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ జరిపిన దర్యాప్తులో మధ్యవర్తులు, కోచింగ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మే 2026లో జరిగిన నీట్ పేపర్ లీక్ సమయంలో, లీక్ అయిన ప్రశ్నపత్రాలను సేకరించి, పంపిణీ చేయడంలో పలువురు మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది.  నిపుణుల నుంచి ఈ లీక్ అయిన ప్రశ్నపత్రాలను పొందినందుకు, కోచింగ్ సంస్థలతో సంబంధం ఉన్న ఇద్దరిని సీబీఐ గుర్తించి అరెస్టు చేసింది. 

పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టయిన 13 మంది నిందితుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి వ్యతిరేకంగా రూపొందించిన చార్జ్‌షీట్‌ను మంగళవారం ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ ఆర్థిక నేరాల విభాగం సమర్పించింది. దీంతో కేంద్రం ఏర్పాటుచేసిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ముందుకు చార్జ్‌షీట్‌ రాబోతున్నది.  మనీ ట్రైల్ విశ్లేషణ జరిపి, నిందితులకు చెందిన పలు బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లాకర్లు, ఒక డీమ్యాట్ ఖాతాను స్తంభింపజేశారు. పేపర్ లీక్ కేసులో అరెస్టు అయిన 13 మందిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) కింద నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస భంగం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాలతో పాటు, అవినీతి నిరోధక చట్టం కింద నేరపూరిత దుష్ప్రవర్తన మరియు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024 ఉల్లంఘనలకు గాను అభియోగాలు మోపారు. ఈ ఛార్జిషీట్‌లో దర్యాప్తు సంస్థ 360 మంది సాక్షులను, 422 పత్రాలను, 43 భౌతిక వస్తువులను పేర్కొంది.
దర్యాప్తు సంస్థ మే 12న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ ప్రారంభించేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లోని 92 ప్రదేశాలలో సోదాలు నిర్వహించాయి.  కేసు నమోదు చేసిన కొన్ని వారాల్లోనే, సమాచారం లీక్ అవ్వడానికి గల మూలాన్ని వెలికితీసేందుకు జరిపిన దర్యాప్తులో భాగంగా సీబీఐ డిజిటల్, కమ్యూనికేషన్ పరికరాలు, పత్రాలు వంటి నేరారోపణ సామాగ్రిని స్వాధీనం చేసుకుంది.
పీ.వీ. కులకర్ణిని అరెస్టు చేయడానికి ఒక రోజు ముందు మనీషా వాఘ్మారేను అదుపులోకి తీసుకోవడంతో, సీబీఐ తన దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేయడం ప్రారంభించింది.  ఈ కేసులో రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్ర విభాగాలకు చెందిన ముగ్గురు ఎన్‌టీఏ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో సహా 13 మంది నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. వారందరిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.