దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద బిజెపి నిరసనలు!

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద బిజెపి నిరసనలు!
 
నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదంపై రాజకీయ ఘర్షణ బుధవారం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద నిరసనలు, ప్రదర్శనలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) యోచిస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద నిరసన చేపట్టిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.
 
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉండగా, పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాల వద్ద బిజెపి నిరసనలు చేపట్టే అవకాశం ఉంది. ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టడం ద్వారా రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే శాంతిభద్రతల సమస్యను సృష్టించారని ఆ పార్టీ ఆరోపించింది. 
 
కాంగ్రెస్ ప్రధాని భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిందని, రాజకీయ ప్రత్యర్థుల నివాసాల వద్ద నిరసనలు తెలిపే రాజకీయ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని బిజెపి విమర్శించింది. మంగళవారం నాటి ఆందోళన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ ప్రదర్శనలు జరగనున్నాయి. 
 
కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్, ప్రధాని నివాసం వద్ద నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు సృష్టించిన గందరగోళం నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బిజెపి బుధవారం లక్నోలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. మధ్యాహ్నం 1:00 గంటలకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం వద్ద ప్రారంభం కానున్న ఈ నిరసన కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి నాయకత్వం వహిస్తారు.
మరోవంక, నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందన్న ఆరోపణలపై ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) చేపట్టిన నిరసన బుధవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పోలీసులు కీలక ప్రాంతాల్లో బారికేడ్లను పెంచడంతో పాటు అదనపు సిబ్బందిని మోహరించారు. 32వ రోజుకు చేరుకున్న ఈ నిరసనలో ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు పాల్గొని, పరీక్షా విధానంలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.