అంతరిక్షంలోకి మరో భారత సంతతి వ్యోమగామి

అంతరిక్షంలోకి మరో భారత సంతతి వ్యోమగామి
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్‌తోపాటు రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవి, అన్నాకికినాలతో కలిసి మంగళవారం అంతరిక్షం లోకి పయనమయ్యారు. కజ్‌కిస్థాన్ లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్ 29 వ్యోమనౌక ద్వారా రాత్రి 8.17 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. 
 
మూడు గంటల్లో ఐఎస్‌ఎస్‌కు సమీపంలోకి చేరుకుంది.  రాత్రి 11.56 గంటలకు వ్యోమనౌక అంతరిక్షకేంద్రానికి చేరుకుంది. అనిల్ మీనన్‌కు ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కావడం విశేషం.  ఎక్స్‌పెడిషన్ 74, 75 మిషన్లలో భాగంగా సుమారు ఎనిమిది నెలల పాటు మీనన్ అక్కడే ఉండి ప్రయోగాలు చేస్తారు.  మీనన్ భార్య అన్నా విల్‌హెల్మ్‌తోపాటు కుటుంబ సభ్యులు, నాసా అడ్మినిస్ట్రేటర్ జెరెడ్ ఇసాక్‌మన్, బైకనూర్ కాస్మోడ్రోమ్ వద్ద నుంచి ఈ ప్రయోగాన్ని వీక్షించారు.
అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత ఈ ముగ్గురు వ్యోమగాములు నాసా వ్యోమగాములు జెసికా మెయిర్, జాక్‌హతావే, క్రిస్ విలియమ్స్‌ను , ఐరోపా అం తరిక్ష సంస్థ వ్యోమగామి సొఫియె అడెనాట్, రోస్‌కాస్మోస్ కాస్మోనాట్లు సెర్గే కుడ్సవెర్‌చకొవ్, సెర్గే మైకయెవ్, ఆండ్రీ ఫెడియెవ్‌లను కలుసుకుంటారు.   మానవ శరీరం అంతరిక్ష వాతావరణానికి ఎలా అలవాటు పడుతుందో అర్థం చేసుకోవడానికి అత్యంత కీలక ప్రయోగాలలో మీనన్ బృందం పాల్గొంటుంది.
అలాగే, సూక్ష్మ గురుత్వాకర్షణలో రక్త ప్రసరణ, సిరల నిర్మాణం, రక్తం కూర్పులో వచ్చే మార్పులపై అధ్యయనం చేస్తారు. దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాముల ఆరోగ్యం కాపాడటానికి ఈ ప్రయోగం ఎంతో కీలకం. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడికి చేపట్టే సుదీర్ఘకాల యాత్రలకు అత్యంత కీలకమైన ఆవిష్కరణగా నిరూపించే ఐఎస్ఎస్‌లోని తాగునీటిని ఉపయోగించి సిరల ద్వారా ద్రవాలను ఉత్పత్తి చేసే ప్రక్రియ పరీక్షలోనూ మీనన్ సహాయపడతారు.
వ్యోమగాములకు ఉపయోగపడే ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే అల్ట్రాసౌండ్ ప్రక్రియలతో సహా అధునాతన వైద్య, సాంకేతిక ప్రయోగాల్లోనూ కూడా ఆయన పాల్గొంటారని నాసా తెలిపింది.  అనిల్‌ మీనన్‌ ప్రధానంగా రక్త ప్రసరణ, రక్తనాళాల్లో మార్పులు..మొదలైన అంశాలపై అధ్యయనం చేయనున్నారు. చంద్రుడు, అంగారకుడిపై భవిష్యత్‌ అంతరిక్ష యాత్రలకు వీరి పరిశోధన ఫలితాలు కీలకం కాబోతున్నాయి.
ఈ ముగ్గురూ 2027లో భూమికి తిరిగి రానున్నారు.  49 ఏళ్ల అనిల్ మీనన్ అమెరికాలోని మిన్నియా పాలిస్‌లో జన్మించారు. ఆయన తండ్రి భారతీయుడు కాగా, తల్లి ఉక్రెయి న్ వాసి.నాసా వ్యోమగామిగా 2021లలో ఎంపిక కావడానికి ముందు ఆయన వైద్యం, సైనిక సేవల్లో అనుభవం సంపాదించారు.