మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను వేంటనే పరిష్కరించాలి 

మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను వేంటనే పరిష్కరించాలి 
ఎంతో పవిత్రమైన బాధ్యతను నిర్వర్తిస్తూ, పిల్లలకు అన్నం పెడుతున్న 54 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు  డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేయకుండా ఉండేందుకు, విద్యాశాతాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు, ఏజెన్సీల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు ఆయన హాజరై కార్మికులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. 


గత ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లు దాటుతున్నా ఆ మాటను నిలబెట్టుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నా, పదేళ్ల క్రితం నాటి రేట్ల ప్రకారమే నిధులు ఇవ్వడం వల్ల కార్మికులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం ఇస్తున్న రూ. 3,000 అరకొర వేతనాన్ని కూడా సకాలంలో ఇవ్వకుండా పెండింగ్‌లో పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి పెంచుతామని చెప్పిన రూ. 10,000 వేతనాన్ని, పెండింగ్‌లో ఉన్న బకాయిలతో  సహా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో తక్షణమే జమ చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. 
 
కార్మికుల పక్షాన నిలబడి వారి డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ తరపున తానే స్వయంగా లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో కార్మికులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, కార్మికుల హక్కుల సాధన కోసం బిజెపి తరపున తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.