దేశంలో పేపర్ లీకేజీలు కలవరపెడుతున్నాయి. ఇటీవల నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనకు గురికాగా, తాజాగా మహారాష్ట్రలో మరో పేపర్ లీకేజీ జరిగింది. ఆదివారం నిర్వహించనున్న టెట్ పేపర్ లీకైంది. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (మహా టెట్ 2023) పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించాల్సి ఉంది. అయితే, పరీక్షకు ఒక్క రోజు ముందు శనివారం ముంబై సమీపంలోని భివండిలో పేపర్ లీకైంది.
దీనిపై పోలీసులకు, రాష్ట్ర విద్యాశాఖకు సమాచారం అందింది. స్పందించిన పోలీసులు భివండిలో టెట్ పేపర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి, పేపర్ లీకేజీ నిజమే అని గుర్తించిన అధికారులు ఆదివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి పరీక్ష తేదీ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు బిహార్, హర్యానాలకు చెందిన వారని గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఘటనపై లోతైన దర్యాప్తు కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సిట్ ఏర్పాటుకు ఆదేశించారు. జాయింట్ సీపీ ఆధ్వర్యంలో ఈ సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉదంతంపై సీఎం ఫడణవీస్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే, డీజీపీలతో చర్చించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రశ్న పత్రాలు విక్రయించేందుకు నిందితులు భివండీ వస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని వారిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
వారి వద్ద నుంచి పలు ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారి వద్ద లభించిన పత్రాలను విద్యాశాఖ సీనియర్ అధికారులు పరిశీలించారని చెప్పారు. అవి అసలు ప్రశ్న పత్రాల నకళ్లేనని వారు ధ్రువీకరించారని పేర్కొన్నారు. పరీక్ష వాయిదా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బంది కలగనుంది. పరీక్షకు పూర్తిగా సిద్ధమైన తర్వాత ఇలా వాయిదా పడటంతో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని 37 ప్రాంతాల్లోని 1,728 కేంద్రాలలో, సుమారు 6,12,500 మంది అభ్యర్థులతో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. నీట్ పరీక్షా కేంద్రాలతో సమయం కలవకుండా ఉండేందుకు, ఈ పరీక్షను ఇంతకుముందే జూన్ 21 నుండి జూన్ 28, 2026కి మార్చిన కొద్ది కాలానికే ఇప్పుడు మళ్లీ వాయిదా వేశారు. ఈ పరీక్ష మరాఠి, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, హిందీ, గుజరాతీ, సింధి, బెంగాలి, కన్నడ భాషల్లో ఉంటుంది.
మరోవైపు, పరీక్షకు ముందే ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చిందనే విషయంపై విద్యాశాఖ విచారణ చేపట్టింది. అనుమానితుల వద్ద ఉన్న పేపర్‌లలోని ప్రశ్నలు గతేడాది టెట్ పరీక్ష కోసం తయారు చేసిన ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎగ్జామినేషన్ కౌన్సిల్ పేర్కొంది.

More Stories
సీఎం మాన్ పై ఎఫ్ఐఆర్.. వెంటనే రాజీనామా చేయాలి
11న ట్రస్ట్ సమావేశం ముందుకు చంపత్ రాయ్ రాజీనామా
తన సినిమా నిర్మాతను ఢిల్లీ ప్రతినిధిగా నియమించిన సీఎం విజయ్