* తొలిసారి పేర్లను వెల్లడించిన ప్రభుత్వం
పాకిస్థాన్‌లో ఉగ్రమూకల్ని అంతం చేసేందుకు భారత సైన్యం గత ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో ఆరుగురు భారతీయ సైనిక సిబ్బంది మృతిచెందినట్లు శుక్రవారం ప్రభుత్వం పేర్కొన్నది. ఆ ఆపరేషన్‌లో వీరమరణం పొందిన ఆ సైనికులు పేర్లను కూడా వెల్లడించారు.
దేశ రక్షణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందిన ఆ జవాన్ల వివరాలను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘రోల్ ఆఫ్ ఆనర్-2025’ జాబితాలో చేర్చారు. త్వరలో న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక శిలాఫలకాలపై వారి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యానికి చెందిన ఐదుగురు, భారత వైమానిక దళానికి చెందిన ఒకరు వీరమరణం పొందారు.
వీరిలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్), రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (4వ బెటాలియన్, జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ), లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ (5 ఫీల్డ్ రెజిమెంట్), హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ (237 ఫీల్డ్ వర్క్‌షాప్), అగ్నివీర్ మురళీ నాయక్ (851 లైట్ రెజిమెంట్), భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు.
దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరి సేవలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి జాతీయ స్థాయిలో గౌరవించింది. ఈ అమరవీరుల్లో రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం దేశంలోని మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన ‘వీర చక్ర’ను ప్రకటించారు. అలాగే భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్‌కు ‘వాయుసేన మెడల్’ ప్రదానం చేశారు.
ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రక్షణ పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ తల్లిదండ్రులు వీరచక్రను అందుకున్నారు. ఆపరేషన్ సింధూర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వీర సైనికులతో పాటు 2025లో జరిగిన వివిధ మిలిటరీ ఆపరేషన్స్‌లో అమరులైన సైనికుల పేర్లను కూడా విడుదల చేశారు.
పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద క్యాంపులపై గత ఏడాది మే 7వ తేదీన భారతీయ సైనిక దళాలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్‌ను పాక్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో డ్రోన్ దాడులు, షెల్లింగ్, వైమానిక అటాక్‌లు జరిగాయి. రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు భీకర ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మే 10వ తేదీన యుద్ధం ముగిసింది.

More Stories
ఐబీ చీఫ్‌గా తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి
రామమందిరం విరాళాల చోరీ కేసులో 8 మంది అరెస్ట్
వచ్చేవారం బెంగాల్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు