కొన్ని రోజుల క్రితం వరకు ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టిన చమురు ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం ఇందుకు ప్రధాన కారణాలు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇది చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు శుభవార్తగా చెప్పవచ్చు.
వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు పునఃప్రారంభం కావడంతో బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా 75 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఎలాంటి సుంకాలు వసూలు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడం దీనికి మరో కారణం. బుధవారం ట్రేడింగ్‌లో అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 72 డాలర్ల వద్ద ట్రేడైంది.
ఒకే రోజులో ఈ రెండు సూచీలు ఒక శాతానికిపైగా తగ్గాయి. గత నెల రోజుల్లో బ్రెంట్, డబ్ల్యూటీఐ ధరలు 20 శాతానికిపైగా పడిపోవడం గమనార్హం. ఇరాన్ సంక్షోభం ప్రారంభమైన సమయంలో హర్మూజ్ జలసంధి మీదుగా చమురు సరఫరా దెబ్బతింటుందనే భయాలు మార్కెట్లను కలవరపరిచాయి. అయితే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయిన చమురు ట్యాంకర్లు మళ్లీ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో మార్కెట్లలో ఆందోళన తగ్గింది. అమెరికా, ఇరాన్‌తోపాటు ప్రాంతీయ దేశాల మధ్య జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు కూడా పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నాయి. సరఫరాలో పెద్ద అంతరాయం ఉండకపోవచ్చనే అంచనాలు బలపడటంతో చమురు ధరలపై ఒత్తిడి పెరిగింది.
దాంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో గత కొంతకాలంగా కనిపించిన ఆందోళన తగ్గుముఖం పట్టింది. చమురు ధరల తగ్గుదల భారత్‌కు ప్రత్యేకంగా లాభదాయకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ధరలు తగ్గితే దిగుమతి వ్యయం తగ్గుతుంది. ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది.

More Stories
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 100 కోట్లకు పైగా చెల్లించాలి
టిఎంసి బ్యాంకు ఖాతాల ఫోరెన్సిక్ పరీక్షలు
దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు