తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంటులో అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురు మహిళా కార్మికులు చనిపోయారు. పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. పెరియపాళ్యం సమీపంలోని కన్నిగైపైర్‌లో ఉన్న సెయింట్ పీటర్స్ అండ్ పాల్స్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ఫెసిలిటీలో ఆదివారం మధ్యాహ్న సమయంలో అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు చనిపోగా, సుమారుగా 67 మంది కార్మికులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని స్టాన్లే మెడికల్ కాలేజీకి తరలించామని కలెక్టర్ కవిత తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారిగా తెలిసింది.
అమ్మోనియా గ్యాస్ పీల్చటంతో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, వాంతులు, తల తిరగడంతో వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ అంబులెన్సులలో సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్య చికిత్సల కోసం కొంతమందిని చెన్నైకు తరలిస్తున్నట్లు తెలిసింది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో అమర్చిన వాల్వ్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సీఫుడ్ యూనిట్లలోని కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్‌లలో చల్లదనం కోసం అమ్మోనియా గ్యాస్ ఉపయోగిస్తుంటారు.
అమ్మోనియా గ్యాస్ లీక్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తిరువళ్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కుమార్, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అమ్మోనియా గ్యాస్ లీక్ కావడానికి కారణాలను కనిపెట్టేందుకు ముగ్గురు సభ్యులతో దర్యాప్తు కమిటీని చేసిన ముఖ్యమంత్రి కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రమాదంపై 24 గంటల్లోగా ప్రాథమిక నివేదిక, మూడు రోజుల్లోగా తుది నివేదిక అందించాలని ఆదేశించారు. సీఎం విజయ్ ఆదేశాలతో ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. మరోవైపు ప్లాంట్ యజమానితో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
More Stories
యోగ కేవలం యోగాసనాలు మాత్రమే కాదు
జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్ట్
టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్ రీటెస్ట్ పేపర్లు అమ్మకం.. విద్యార్థి అరెస్ట్