శివసేనలో ఇక ఎలాంటి గ్రూపులు లేవని, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలో నడుస్తున్నదే ఏకైక అసలైన శివసేన అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఇప్పుడు ఎటువంటి వర్గాలూ లేవని, ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో ఒకే ఒక్క శివసేన ఉందని తెలిపారు.
గతంలో ఏక్‌నాథ్ షిండే పేరు పక్కన ‘శివసేన-షిండే వర్గం’ అని చెప్పాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అటువంటి వర్గ విభజన లేదని, కేవలం ఒకే శివసేన ఉందని ఆయన పేర్కొన్నారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి)కు చెందిన తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ సమావేశానికి హాజరుకాకుండా, ప్రత్యేక సమూహంగా ఏర్పడాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం, షిండే నేతృత్వంలోని శివసేనలో వీరి విలీనం త్వరలోనే అధికారికం కానుందని, తద్వారా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వానికి వీరు మద్దతు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) వర్గంలో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
‘ఆపరేషన్ టైగర్’లో భాగంగా యుబిటి ఎంపీలు పెద్ద సంఖ్యలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వైపు మళ్లుతుండటంతో ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. దీనివల్ల బహిరంగ విభేదాలు, ఎంపీలు గైర్హాజరు కావడం, చట్టపరమైన చర్యల హెచ్చరికలు వంటి పరిస్థితులు తలెత్తాయి.ఢిల్లీలో ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే పక్షం అత్యవసరంగా నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ చీలికను స్పష్టం చేసింది.
ఆ పార్టీకి మొత్తం 9 మంది లోక్‌సభ ఎంపీలలో ముగ్గురు(అరవింద్ సావంత్, అనిల్ దేశ్‌రాయ్, రాజభావు వాజే) మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు నాగేష్ ఆష్టికర్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దినా పాటిల్, ఓంప్రకాష్ రాజేనింబాల్కర్, భావుసాహెబ్ వాక్‌చౌరే ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన శివసేన చీఫ్ విప్ అనిల్ దేశాయ్, గైర్హాజరైన ఆరుగురు ఎంపీలకు ‘షోకాజ్’ నోటీసులు జారీ చేశారు.
వారికి కేవలం 24 గంటల గడువు ఇచ్చారు. నిర్ణీత సమయంలోగా వారు లిఖితపూర్వకంగా సరైన కారణాలు చెప్పకపోతే, వారు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం వారిపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడానికి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు.

More Stories
అయోధ్య అంశాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోకి లాగే ప్రయత్నం
భగవంత్ మాన్ హాజరు వీడియోను విడుదల చేసిన అకల్ తఖ్త్
ఎఫ్ఏటీఎఫ్ ఉపాధ్యక్షునిగా మొదటిసారి భారతీయ అధికారి అగర్వాల్