బంగ్లాలో ఇస్లాం సంస్థల హెచ్చరికలతో ఆగిపోయిన రాముడి విగ్రహం 

బంగ్లాలో ఇస్లాం సంస్థల హెచ్చరికలతో ఆగిపోయిన రాముడి విగ్రహం 

బంగ్లాదేశ్‌లో దాదాపు 80 శాతం పూర్తైన శ్రీ రాముడి విగ్రహ నిర్మాణం ప్రభుత్వ నిషేధం కారణంగా కొంతకాలంగా నిలిచిపోయింది. విగ్రహ ఏర్పాటును బంగ్లాలోని అతివాద ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. బంగ్లాదేశ్‌లోని ఉత్తర గైబంధ జిల్లాలోని పలాష్బరి దేవాలయ సమీపంలో 81 అడుగుల రాముడి విగ్రహాన్ని అక్కడి హిందువులు ఏర్పాటు చేస్తున్నారు. 

రాముడి విగ్రహంతోపాటు 50 అడుగుల కృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 220 మిలియన్ టాకాలు (రూ.15.కోట్లు) ఖర్చు కానుంది. ఇందులో రాముడి విగ్రహం నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తైంది. ఈ విగ్రహం ఆవిష్కరిస్తే  బంగ్లాదేశ్‌లోనే అతిపెద్ద రాముడి విగ్రహం అవుతుంది. అయితే, ఈ విగ్రహ ఏర్పాటును బంగ్లాలోని రాడికల్ ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

ఈ విగ్రహాన్ని తొలగించాలని అక్కడి మతపెద్దలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కొందరు విగ్రహాన్ని అపవిత్రం చేసే పనులు చేశారు. దీంతో స్థానిక ప్రభుత్వం ఈ విగ్రహ ఏర్పాటును నిషేధించింది. అయితే, ఇలా విగ్రహ నిర్మాణాన్ని ఆపడాన్ని బంగ్లాదేశ్‌లోని హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు ఇటీవల ఆందోళన చేశాయి. 

ఢాకా యూనివర్సిటీలో ఇటీవల హిందూ విద్యార్థులు నిరసన చేపట్టారు. రాముడి విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి కేంద్ర బిందువైన రాముడికి నివాళిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని శ్రీశ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిదాస్ చంద్ర దాస్ తెలిపారు. అటు హిందూ సంఘాల ఆందోళన, ఇటు ముస్లిం సంఘాల హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. 

అయితే, ఈ ఘటన అక్కడి ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిక్ రెహమాన్ పనితీరును తప్పుబడుతున్నారు. ఆయన హయాంలో, బంగ్లాదేశ్‌లో మత స్వేచ్ఛ అంటే ఇదేనా? అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.