ఈనెల 21న కాళేశ్వరంలో ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయడంతో, ఈ పుష్కరాలకు హాజరయ్యేవారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లు తెలిపారు. సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మే 21 వ తేదీ ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠం స్వామి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ పుణ్య స్నానం ఆచరించి సరస్వతీ అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారని, గవర్నర్ కూడా పాల్గొంటారని వెల్లడించారు. ప్రధానంగా కాళేశ్వరం ఆలయంలో దర్శనాలు, పుష్కర స్నానాలకు వచ్చే వివిధ పీఠాధిపతులకు తగు ఏర్పాట్లు, పుష్కర ఘాట్ ల వద్ద పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మేడారం జాతర స్పూర్తితో సరస్వతి అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రతీ రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజి ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారని, ఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ అంత్య పుష్కరాల అనుభవాలు రానున్న గోదావరి పుష్కరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, 2012 లో జరిగిన సరస్వతి పుష్కరాలకు కేవలం 2 లక్షల మంది మాత్రమే హాజరవగా, గత సంవత్సరం జరిగిన ఆది పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు. ఈ అంత్య పుష్కరాలలో ప్రతి రోజు హోమాలు, ఘాట్ వద్ద హారతి, సాంసృతిక కార్యక్రమాలు, తెప్పోత్సవం నిర్వహణతో పాటు పెద్ద పిండ ప్రదానాలు జరుగుతాయని వివరించారు. ఈసారి ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు మాట్లాడుతూ, అతిథి గృహాలు, 100 గదుల చౌల్ట్రీ, ఘాట్ వద్ద టెంట్ హౌస్ ల ఏర్పాటు, ప్రముఖులకు ఆహ్వానాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లకు రెవెన్యూ శాఖ సమన్వయం చేపడుతోందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ 12 రోజుల పాటు వైద్య శిబిరాలు, అంబులెన్సులు, మందులు, అత్యవసర బృందాలను ఏర్పాటు చేస్తుందని, పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని వివరించారు.

More Stories
హామీల అమలు లేకుండా పగటి కలలు కంటున్నా రేవంత్!
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం కోసం బీజేపీ పోరాటంలో ఉద్రిక్తత
శని జయంతి సందర్భంగా సామూహిక అన్నదానం