ఇంధన సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు నష్టం జరగనివ్వబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హామీనిచ్చారు. ఇంధన సరఫరాకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ నెరవేర్చుతామని భరోసా ఇచ్చారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంపై హాజరయ్యేందుకు భారత పర్యటనకు రానున్న లావ్రోవ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, రష్యాల మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని, వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఎప్పటికీ ఉండదని స్పష్టం చేశారు.
“ఇంధన సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు నష్టం జరగనివ్వం. చమురు సరఫరాలో ఆటంకం కలగనివ్వం. భారత అవసరాల దృష్ట్యా గ్యాస్, చమురు, బొగ్గు వంటివి సరఫరా చేస్తూనే ఉంటాం. భారత్-రష్యా బంధాలను బలహీనపరిచేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాల పట్ల ఇరు దేశాలు అప్రమత్తంగా ఉండాలి. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం కోసం కొత్త పవర్ యూనిట్ల నిర్మాణంలో మా సహకారం కొనసాగుతుంది” అని లావ్రోవ్ తెలిపారు
“హిందూ-రూసీ భాయ్ భాయ్ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. భారతీయ సినిమాలు, రాజ్ కపూర్, టెలివిజన్ సిరీస్‌లకు రష్యాలో ఎంతో ఆదరణ ఉంది. సైనిక సహకారం, ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థ.. ఇలా ఎన్నో రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధం చాలా దృఢంగా ఉంది. అది ఎప్పటికీ కొనసాగుతుంది” అని లావ్రోవ్ స్పష్టం చేశారు.ప్రపంచ ఇంధన కారిడార్లపై ఆధిపత్యం చెలాయించడానికి, రష్యాతో ఇంధన సంబంధాలు కలిగిన దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
“ప్రతిదాన్ని, ముఖ్యమైన ఇంధన మార్గాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకోవడమే వారి [అమెరికా] లక్ష్యం. ఈ లక్ష్యం చాలా స్పష్టం; అసలు ఏం జరుగుతుందో భారతదేశానికి అర్థమైందని నేను నమ్ముతున్నాను,” అని లావ్రోవ్ తెలిపారు. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా ఐరోపా దేశాలు, మార్కెట్ కారకాలచే నడపబడకుండా, రష్యా ఇంధన సరఫరాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని లావ్రోవ్ పేర్కొన్నారు. ఒప్పందాలను రద్దు చేస్తూ, ఆర్థిక ఆధిపత్యాన్ని అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆయన పాశ్చాత్య శక్తులను కూడా విమర్శించారు.

More Stories
నిరసకారులపై కాల్పులు.. పీఓకేలో 30 మంది మృతి
పాక్ ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ వాదనను తిప్పికొట్టిన భారత్
హెచ్1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజ్ కొట్టేసిన కోర్ట్