నీట్ ప్రశ్న పత్రాల లీక్ లో ఐదుగురు అరెస్ట్ .. ఎబివిపి నిరసనలు 

నీట్ ప్రశ్న పత్రాల లీక్ లో ఐదుగురు అరెస్ట్ .. ఎబివిపి నిరసనలు 
నీట్ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. అంతకుముందు, మహారాష్ట్రలో ఓ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను సీబీఐకి అప్పగించారు. మరోవైపు  ఎన్టీయే  తీరును నిరసిస్తూ ఢిల్లీలో ఏబీవీపీ కార్యకర్తలు భారీ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్‌లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్‌లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్మార్‌ను పట్టుకున్నారు.

నాసిక్‌లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్‌లో అరెస్టు తరువాత వారి విచారణ క్రమంలో తెలిసే విషయాలను బట్టి ఇతర రాష్ట్రాలలో అరెస్టులు, దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిబిఐ సిద్దం అయింది.
 
మహారాష్ట్రలోని బిబ్వేవాడి ప్రాంతానికి చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను చాలాసేపు ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులకు అప్పగించారు. అయితే పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ఆమె పాత్ర ఏంటన్న వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నాసిక్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రశ్నాపత్రం లీక్ అయిందని భావిస్తున్నారు. తొలుత  పుణెకు చెందిన ఓ వ్యక్తి నుంచి నాశిక్‌కు చెందిన శుభం ఖైర్నార్‌ రూ.10 లక్షలు పెట్టి ప్రశ్నాపత్రం కాపీని కొన్నట్లు తెలిపారు. ఆ కాపీని రూ.15 లక్షలకు హరియాణా వాసికి శుభం అమ్ముకున్నాడు.

అనంతరం పేపర్‌ సెట్‌లు హరియాణా, రాజస్థాన్‌లోని పెద్ద కోచింగ్‌ సెంటర్లతో పాటు జమ్మూకశ్మీర్‌, బిహార్‌, కేరళకు కూడా వెళ్లినట్లు తెలుసుకున్నారు. వీటిని ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా అమ్మినట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు ప్రధాన నిందితుడి నుంచి ప్రశ్నాపత్రాన్ని బిజెవైఎం నేత దినేష్‌ ‌బిన్వాల్‌ ‌రూ.15 లక్షలకు కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
మరోవైపు పేపర్‌ లీక్‌ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిల్లీలోని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కార్యాలయం వెలుపల ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  ఎన్టీయేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతన ఉండేలా చర్యలు తీసుకోవాలని నినదించారు. 

ఈ క్రమంలో వందలాదిమంది ఎబివిపి సభ్యులు ఎన్టీయే కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు తావిచ్చింది. బారికేడ్ల పైకి ఎక్కినవారిని పోలీసులు వెనక్కి లాగి పడేశారు. శాస్త్రి భవన్ వెలుపల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని,  ఎన్టీయేను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రవేశ పరీక్షల పవిత్రత విషయంలో ఎలాంటి రాజీని అంగీకరించలేమని పేర్కొంటూ, పేపర్ లీక్. పరీక్షా అవకతవకలపై కేంద్ర ఏజెన్సీలచే నిష్పక్షపాతంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ నిరసన సందర్భంగా ఏబీవీపీ సభ్యుడు సూర్య ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, “నా స్నేహితుడు పరీక్ష రాశాడు. నా తమ్ముడు కూడా రాశాడు. అతను కోటాలో చదువుకుంటున్నాడు… పేపర్ లీక్ అయిందని విని ఇంటికి వచ్చాడు, ఇప్పుడు మళ్లీ అక్కడికి తిరిగి వెళ్లాల్సి వస్తోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు. 

నిరసనకారులలో ఒకరైన, ఢిల్లీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లాలో ఎల్‌ఎల్‌బి చదువుతున్న ఏబీవీపీ సభ్యుడు ప్రేమ్ పరాశర్ మాట్లాడుతూ, విద్యార్థుల పరీక్షలు సజావుగా నిర్వహించేందుకే ఎన్‌టిఎను ఏర్పాటు చేశారని పేర్కొంటూ “…ఈ మోసం, అవినీతికి బాధ్యులైన వారిని తొలగించాలి. ఎన్‌టిఎపై సమగ్ర విచారణ జరపాలన్నదే ప్రభుత్వ డిమాండ్” అని  తెలిపారు.