రాజీనామాకు దీదీ మొండికేయడంతో బెంగాల్ అసెంబ్లీ రద్దు

రాజీనామాకు దీదీ మొండికేయడంతో బెంగాల్ అసెంబ్లీ రద్దు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజీనామా చేయడానికి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానితో ఆమె ప్రభుత్వం కూడా రద్దయిన్నట్లయింది. ఆమె ప్రభుత్వ పదవీకాలం గురువారంతో ముగియనున్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రంలో వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, మే 2021లో ప్రస్తుత శాసనసభ కొలువుదీరింది. ఇటీవల రెండు దశల్లో ముగిసిన ఎన్నికల నేపథ్యంలో, ఈ సభ రద్దుతో పదవి విరమిస్తున్న శాసనసభ పదవీకాలం అధికారికంగా పూర్తయినట్లయింది.
 
ఇటీవల వెలువడిన ఫలితాల్లో బీజేపీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించి మెజార్టీ మార్కును అధిగమించింది. ఇక గత 3 పర్యాయాలుగా పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ ఘోర పరాభవానికి గురైన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన దీదీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 293 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఇక 2011 నుంచి అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ ఈ ఎన్నికల్లో 80 స్థానాలకు పరిమితమైంది. 
 
ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. తాను ఓడినా సీఎం పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ ప్రకటించడంతో బంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తాను లోక్‌భవన్‌కు వెళ్లను అని, గవర్నర్‌కు రాజీనామా పత్రం ఇవ్వనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘంపైనా, బీజేపీపైనా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోలేదని, విజయం సాధించిందని తెలిపారు. తమ ఓట్లను చోరీ చేశారని మండిపడ్డారు. 
 
మరోవైపు  బెంగాల్‌లో భారీ విజయాన్ని అందుకున్న బీజేపీ ఈనెల 9వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. రాజధాని కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరగనున్నట్లు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నట్లు తెలిపారు.  శుక్రవారం బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.