సౌదీ అరేబియా నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు ఈ నౌక బయలుదేరింది. గత మూడు నాలుగు రోజులుగా హర్మూజ్ జలసంధి దాటేందుకు క్లియరెన్స్ కోసం వేచి చూస్తోంది. శుక్రవారం జలసంధిలోకి ప్రవేశించగానే ఇరాన్ గార్డ్స్ నౌకను చుట్టుముట్టి కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత సంజయ్ మహర్ తన కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు.
ఇరాన్ దళాలు నౌకను స్వాధీనం చేసుకున్నాయని, కాల్పుల సమయంలో తామంతా నౌకలోని సురక్షిత ప్రదేశంలోకి వెళ్లామని, ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నామని ఆయన తెలిపినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మొదట మీడియా ద్వారా ఈ విషయం తెలిసి తాము చాలా కంగారుపడ్డామని, తర్వాత వారి అబ్బాయి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు.
అయినప్పటికీ తమకు చాలా ఆందోళనగా ఉందన్నారు. నౌకలోని భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని తాము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని చెప్పారు. సంజయ్ కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే జైదీప్ బిహానీని కలిసి విషయాన్ని వివరించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో భారత్‌తోపాటు ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్, శ్రీలంక దేశాలకు చెందిన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సుమారు 15 ఏళ్లుగా మర్చంట్ నేవీలో పనిచేస్తున్న సంజయ్ 20 రోజుల క్రితమే డ్యూటీ కోసం ఇంటి నుంచి వెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

More Stories
యూఏఈ ఏఐ సాయంతో సగం ప్రభుత్వ సేవలు
చర్చలు లేకుండానే వెళ్ళిపోయిన ఇరాన్ బృందం
దావూద్ ఇబ్రహీంతో సంబంధం గల సలీం డోలా అరెస్ట్!