బాగా చదువుకున్న వాళ్లు కూడా డిజిటల్ అరెస్టులకు బలి 

బాగా చదువుకున్న వాళ్లు కూడా డిజిటల్ అరెస్టులకు బలి 

నేటి సమాజంలో బాగా చదువుకున్న వాళ్లు కూడా డిజిటల్ అరెస్టు మోసాలకు బలి అవుతుండడంపై సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టు కారణంగా పౌరులు, మరీ ముఖ్యంగా వృద్ధులు తమ జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోతున్న నేపథ్యంలో, ఈ కేసులను సుమోటో స్వీకరించి, విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, తనకు తెలిసిన ఓ మహిళా అధికారిణి, తనకు పదవీ విరమణ అనంతరం వచ్చిన ప్రయోజనాలు అన్నింటినీ ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లో కోల్పోయారని పేర్కొన్నారు. అంతేకాదు “ఆమె తన జీవితకాల పొదుపు మొత్తాన్ని పోగొట్టుకుని కన్నీరుమున్నీరయ్యారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.  అయితే ప్రస్తుతం అంతర్-విభాగాల మధ్య సమావేశాలు జరుగుతున్నందున ఈ కేసు విచారణను వాయిదా వేయాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనితో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.

ఈ కేసులో అమికస్ క్యూరీ (కోర్టుకు సహాయకారి)గా వ్యవహరిస్తున్న సీనియర్ అడ్వకేట్ ఎన్.ఎస్. నప్పినై మాట్లాడుతూ, “మోసగాళ్లు ప్రభుత్వ అధికారులుగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనితో బాధితులు భయాందోళనతో ఆలోచనా శక్తిని కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు మధ్యవర్తిత్వ సంస్థలు సాంకేతిక రక్షణలను కల్పించాల్సిన అవసరం ఉంది” అని సూచించారు.

గతేడాది పలు ప్రభుత్వ సంస్థలు, న్యాయాధికారుల పేరుతో నటిస్తూ పౌరులను, ముఖ్యంగా వయోవృద్ధులను బెదిరింది సొమ్ము వసూలు చేసిన డిజిటల్ అరెస్టు కేసులను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ సందర్భంగా, న్యాయమూర్తుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ, నకిలీ కోర్టు ఉత్తర్వులను సృష్టించడం అనేది న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 

అంతేకాదు దీన్ని ‘రాజ్యాంగ గౌరవంపై నేరుగా జరుగుతున్న దాడి’గా అభివర్ణించింది. ఇలాంటి మోసాల వల్ల ఇప్పటి వరకు సుమారు రూ.3వేల కోట్లు స్వాహా అయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది. న్యాయపరమైన పత్రాల ఫోర్జరీ, దోపిడీ, అమాయక ప్రజలను వంచించే ఈ ముఠాల మూలాలను వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల మధ్య సమన్వయం అవసరం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

కాగా, గతవారం అంబాలాకు చెందిన ఓ వృద్ధ దంపతులు తమ జీవిత కాలమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును డిజిటల్ అరెస్టు వల్ల కోల్పోయినట్లు ఫిర్యాదు చేయడంతో ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది.