బిహార్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు. బుధవారం పాట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అట హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రులుగా జేడీయూ సీనియర్ నేతలు విజయ్ కె చౌధరీ, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి జె.పి. నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి.ఎల్. సంతోష్ తదితర సీనియర్ బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు. సామ్రాట్ చౌధరీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముందు పట్నాలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇప్పటిదాకా ముఖ్యమంతిగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన అనంతరం మంగళవారం రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆయన స్థానంలో సామ్రాట్ చౌదరి సీఎంగా బాధ్యతలు చేపట్టారు బిహార్‌లో ప్రస్తుతం జేడీయూ, బీజేపీ, ఇతర పార్టీలతో కలిసి ఎన్‌డీయే కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఇంతకాలం జేడీయూ నుంచి నితీష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా, ఇంతకాలం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
బీజేపీకి మొదటిసారి ముఖ్యమంత్రి పదవి దక్కడంతో జేడీయూకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు లభించాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సామ్రాట్ సెక్రటేరియట్‌కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. బీహార్‌లో పాలన ‘మోదీ-నితీష్ నమూనా’లోనే ఉంటుందని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “నేను ఈ రోజు నుంచే బీహార్ కోసం పని ప్రారంభిస్తాను. బీహార్‌లో మోదీ నితీష్ నమూనా మాత్రమే పనిచేస్తుంది,” అని ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ అభినందనలు
చౌదరిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ, ఆయనకున్న క్షేత్రస్థాయి అనుభవం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. “బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సమ్రాట్ చౌదరి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు! ఆయన శక్తి, ప్రజా సేవ పట్ల అంకితభావం, క్షేత్రస్థాయి అనుభవం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, బీహార్ సర్వతోముఖాభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంటుందని నాకు పూర్తి నమ్మకం ఉంది,” అని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో రాశారు.
ప్రస్తుతం దేశంలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న 16వ బీజేపీ నేతగా సామ్రాట్ నిలిచారు. దేశంలోని రాష్ట్రాల్లో ఇప్పటివరకు బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పదవి దక్కిన 19వ రాష్ట్రం బిహార్. బీజేపీ చరిత్రలో ఆ పార్టీ నుంచి సీఎం పదవి దక్కించుకున్న 57వ వ్యక్తి సామ్రాట్. గతంలో ఆర్‌జేడీలో ఉన్న ఆయన 2017లో బీజేపీలో చేరారు. బిహార్‌లో వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది.

More Stories
ఆసక్తి కలిగిస్తున్న అస్సాం ఓటర్ల భారీ పోలింగ్ శాతం
భారత్‌కు మూడు రెట్లు రష్యా చమురు దిగుమతులు
ఆశా భోస్లే పాటలు ప్రసారం.. పాక్ టెలివిజన్ పై చర్యలు