2021లో నందిగ్రామ్‌లో బంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి సాధించిన విజయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావిస్తూ ఇవి సాధారణ ఎన్నికలు కావని, ఈ ఎన్నికలు అభివృద్ధికి, బెంగాల్ చరిత్రను తిరగరాయడానికి ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి అడ్డుపడుతోందని విమర్శించారు. ప్రైవేటు రంగంలో సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు.
బెంగాల్ యువతకు టీఎంసీ ప్రభుత్వం చేసిన ద్రోహం వందేళ్లయినా సరే ఆ పార్టీ కడిగేసుకోలేదని బంగాల్లోని పశ్చిమ మేధినీపుర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ధ్వజమెత్తారు. ఒకప్పుడు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉపాధి కోసం హల్దియాకు వచ్చేవారని, కానీ నేడు ఇదే ప్రాంతానికి చెందిన యువత అండమాన్‌కు, ఒడిశాకు వలస వెళ్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగాల వేటలో బెంగాల్ వాసులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
టీఎంసీ ప్రభుత్వం హయాంలో నిజంగా వృద్ధి చెందిన ఏకైక విషయం ఏమిటంటే చొరబాట్లేనని ఎద్దేవా చేశారు. నకిలీ పత్రాల తయారీకి, పశువుల అక్రమ రవాణాకు టీఎంసీ ఒక వేదికగా మారిందని ఆరోపించారు. బంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం దుష్పరిపాలన చేస్తోందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని అధికారం నుంచి గద్దె దించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగం ప్రకారం టీఎంసీ చేసిన మోసాలను బయటకు తీస్తామని, బెంగాల్ యువతకు వ్యతిరేకంగా తృణమూల్ చేసిన పాపాలు వందేళ్లు గడిచినా తొలగిపోవని మోదీ స్పష్టం చేశారు. ఒక్కసారి డబుల్-ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇక్కడ అమల్లోకి వస్తాయని చెప్పారు. బెంగాల్ ప్రజలకు ఆరు హామీలు ఇస్తున్నానని పేర్కొంటూ అన్యాయానికి గురైన ఆడబిడ్డల కేసులను తిరగదోడుతామని, అవినీతికి సాయం చేస్తున్న చట్టాలను రూపుమాపుతామని ప్రధాని తెలిపారు.
తృణమూల్ ప్రభుత్వంలో కుంభకోణాలకు, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని ప్రధాని తేల్చి చెప్పారు. శరణార్థులకు రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక హక్కులను కల్పిస్తామని, చొరబాటుదారులను మాత్రం దేశం నుంచి తరిమికొడతామని చెప్పారు. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి రాగానే 7వ వేతన కమిషన్‌ను అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
“ప్రధానిని వ్యతిరేకించడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం చేకూరదు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరూ ఏకతాటిపై పనిచేసినప్పుడే లాభపడుతుంది. అందుకే బంగాల్‌కు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం. టీఎంసీకి ‘పీఎం’ అనే పదం పట్ల ఎందుకంత తీవ్రమైన ద్వేషం. ఆ పదంతో ముడిపడి ఉన్న ప్రతి పథకం పేరును వారు మార్చేశారు. లేదంటే ఆ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడానికే నిరాకరించారు” అంటూ విమర్శించారు.

More Stories
బెంగాల్ ఫాల్టాలో ఉద్రిక్తత.. టీఎంసీ గూండాల బెదిరింపులు
అలర్ట్ సిస్టమ్ తో దేశవ్యాప్తంగా మోగిన మొబైల్ ఫోన్లు!
మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు!