* ఇరాన్ నుంచి భారతీయులు వెంటనే బయటపడండి!
అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. రెండు వారాల కాల్పుల విరమణ పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. యుద్ధం వల్ల ఆ ప్రాంతంలో
ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. ప్రపంచ ఇంధన సరఫరాతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపింది. ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలు, దౌత్యపరమైన సంప్రదింపులే సరైన మార్గాలని వెల్లడించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని తాము కోరుకుంటున్నట్లు విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
“ఈ కాల్పులు విరమణ ఒప్పందం ద్వారా ఇకపై హార్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయని ఆశిస్తున్నాం’’ అంటూ కేంద్రం ప్రకటించింది. యుద్ధం, బలప్రయోగం కంటే చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే శాంతి లభిస్తుందనే విధానానికి తాము కట్టుబడి ఉన్నట్లు భారత్ మరోసారి స్పష్టం చేసింది.
కాగా, ఇరాన్ లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక అడ్వైజరీ జారీచేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టును పంచుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని కోరింది.
ఇరాన్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా లేదా వారితో సమన్వయం చేసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రావద్దని హెచ్చరించింది. ఈ మేరకు రాయబార కార్యాలయం అత్యవసర సమయంలో సంప్రదించేందుకు ఫోన్ నెంబర్‌లు ఇచ్చింది. +989128109115, +989128109109, +989128109102, +989932179359, మెయిల్ ఐడి – cons.tehran@mea.gov.in ను షేర్ చేసింది.

More Stories
హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు
ఒపెక్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్న యూఏఈ
యావత్ ప్రపంచానికి ప్రధాన ముప్పుగా ఉగ్రవాదం