ఇప్పటివరకు ప్రభుత్వ, ఆలయ భూముల ఆక్రమణ, రికార్డులు తారుమారు చేయడం వంటివి చూశాం! కానీ, ఇప్పుడు ఏకంగా ఓ దేవాలయాన్నే కాంగ్రెస్ నాయకుడికి ధారాదత్తం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అది కూడా అంతా ఒక్క రోజులోనే వేగంగా జరగడం విస్మయం కలిగిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ పునరావాస కాలనీలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీతారామాంజనేయ ఆలయ విషయంలో అన్ని హక్కులను కాంగ్రెస్ నాయకుడికి కల్పిస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్న కబ్జాలు, ఆక్రమణలకు పరాకాష్టగా భావించవచ్చు.
దీని వెనుక ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రమేయం ఉన్నట్లు స్వయంగా సంబంధిత తహసీల్దారే తనకు చెప్పినట్టుగా గ్రామ సర్పంచ్ చెప్పడం సంచలనం సృష్టిస్తున్నది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు ప్రాజెక్టు) నిర్మాణంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో కొన్ని గ్రామాలు పూర్తిగా, మరికొన్ని గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురైన విషయం తెలిసిందే.
అందులో బోయినపల్లి మండలం నీలోజిపల్లె గ్రామం పూర్తిగా ముంపునకు గురైంది. ముంపునకు ముందు ఈ గ్రామంలో హనుమాన్ దేవస్థానం ఉండేది. ప్రాజెక్టులో నీలోజిపల్లె మునిగిపోవడంతో గ్రామానికి సంబంధించి కరీంనగర్- వేములవాడ రహదారి పక్కన పునరావాస కాలనీని గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్నింటికీ పరిహారం ఇచ్చినట్టు నీలోజిపల్లె హనుమాన్ దేవాలయ స్థలానికి ఆనాడు ప్రభుత్వం రూ.9.60 లక్షలను బ్యాంకులో జమ చేసింది.
పునరావాస కాలనీ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కేటాయించిన భూమిలో నాటి సర్పంచ్, గ్రామస్తులంతా కలిసి 2018లో సీతారామాంజనేయ ఆలయాన్ని నిర్మించారు. అందుకోసం పాత హనుమాన్ ఆలయానికి వచ్చిన డబ్బులను వినియోగించారు. ఆ డబ్బులు కూడా సరిపోకపోవడంతో గ్రామస్తులంతా కలసి దాదాపు మరో రూ.3 లక్షలు పోగు చేసి నిర్మాణం పూర్తి చేశారు. నాటి నుంచి నేటి వరకు పంచాయతీ ఆధ్వర్యంలోనే ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
పంచాయతీరాజ్, రూరల్ ఎంప్లాయిమెంట్ రిజిస్టర్ ప్రకారం చూసినా ఈ గుడికి ఓనర్ పంచాయతీ అని స్పష్టంగా రాసి ఉన్నది. అన్ని ఆధారాలుండగా బోయినపల్లి మండల తహసీల్దార్ మాత్రం ఈ ఆలయంపై అన్ని హక్కులూ కూస రవీందర్ (కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఓ మంత్రి ముఖ్య అనుచరుడు)కు కల్పిస్తూ గత నెల 31న సర్టిఫికెట్ జారీ చేయడం కలకలం రేపింది. సహజంగా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు ఇస్తే నెలల తరబడి తిరిగినా అవి పరిష్కారమవుతాయో? లేదో తెలియదు.
కానీ, ఈ ఆలయానికి సంబంధించి మాత్రం అన్నీ ఒక్క రోజుల్లోనే, చెప్పాలంటే కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. తహసీల్దార్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే మార్చి 31న కూస రవీందర్ దరఖాస్తు సమర్పించినట్టు, అదే రోజు గిర్దావర్ నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. విచిత్రం ఏమింటే ఇదే రోజు తహసీల్దార్ సర్టిఫికెట్ జారీ చేశారు. కూస రవీందర్ సమర్పించిన వినతి పత్రంతోపాటు గిర్దావర్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని, రవీందర్ గుత్తాధిపత్యంలో ఉన్న విస్తీర్ణంలో సీతారామాంజనేయ ఆలయం నిర్మించారని, ఆయన ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ ఉంటుందని ధ్రువీకరిస్తూ తహసీల్దార్ ఆగమేఘాలపై సర్టిఫికెట్ జారీ చేశారు.
సర్పంచ్ ఎవరున్నా పంచాయతీ ఆధ్వర్యంలోనే ఆలయంలో వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. నిజానికి ఇదో గ్రామానికి సబంధించిన దేవాలయం. ఏదైనా సమస్య వచ్చినా, లేదా వినతిపత్రాలు వచ్చినా సదరు పంచాయతీకి నోటీస్ ఇచ్చి వివరణ కోరాలి. లేదా నేరుగా ప్రజలతో సమావేశమై అభిప్రాయ సేకరణ జరిపి రిపోర్టు ఇవ్వాలి. ఇవేవీ లేకుండానే ఒక్క రోజులోనే కాంగ్రెస్ నాయకుడికి అన్ని హక్కులూ కల్పిస్తూ తహసీల్దార్ సర్టిఫికెట్ జారీ చేయడం విస్మయం కలిగిస్తున్నది.
దరఖాస్తు ఇచ్చిన అరగంటలో ఆర్‌ఐ రిపోర్టు ఇవ్వడం, ఆ వెంటే ఎమ్మార్వో సర్టిఫికెట్ జారీ చేయడం చూస్తే అందులో ఏం జరిగిందో అర్థమవుతది. దీనిపై ఎమ్మార్వోను అడిగితే ‘నాకు మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి వత్తిడి ఉండటం వల్లే ఇచ్చాను’ అని చెప్పడం గమనార్హం. గ్రామస్తులకు సంబంధించిన రామాలయాన్ని ఒక వ్యక్తికి సంబంధించిందని ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే ‘నా ఇష్టం.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
గ్రామస్థులు కట్టుకున్న దేవాలయాన్ని ఎలాంటి విచారణ లేకుండా అది కూస రవీందర్‌దే అంటూ సర్టిఫికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? దీనిపై కలెక్టర్ గరిమా అగర్వాల్ తక్షణమే స్పందించాలని సర్పంచ్ అనుముల భాస్కర్ డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన విచారణ చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ జారీచేసిన ఎమ్మార్వోను, నివేదిక ఇచ్చిన ఆర్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు.
More Stories
మామిడి ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు?
ఇరాన్ క్షిపణి లాంచర్లలో సగం కూడా ధ్వంసం కాలేదు
డ్రగ్స్ కేసులో ఐఎఎస్ అధికారిణి కుమారుడు