కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం

కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం
కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని, దీనివల్ల లక్ష కోట్ల ప్రజాధనం వృథాగా నీటి పాలయ్యిందని కేంద్ర జల్‌శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తెలిపారు.  ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని బీఆర్ఎస్ సభ్యుడు సురేశ్‌ రెడ్డి కోరారు. 
 
సురేష్‌ రెడ్డి వేసిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి మంత్రి సోమవారం లిఖిత పూర్వకంగా పలు అంశాలను వెల్లడించారు.   కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని వివరిస్తూ. రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి అనుమతుల కోసం కేంద్రం దగ్గరికి వచ్చారని తెలిపారు.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్ఎస్డీఏ నివేదికను ప్రస్తావించిన కేంద్రమంత్రి ప్రాజెక్టు లోపాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని తెలిపారు.
కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేయాలని, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కోరగా జల్‌జీవన్‌ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రతిపాదన పంపలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.873 కోట్లు ఉన్నట్టు తెలిపారు. అయినా మూడు సంవత్సరాల్లో కేవలం రూ.194 కోట్లే ఖర్చు చేశారని చెప్పారు. 
“కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కేంద్రబృందం అధ్యయనం చేస్తుంది. జల్‌జీవన్‌ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క ప్రతిపాదన పంపలేదు. తెలంగాణ వద్ద జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.873 కోట్లున్నాయి. రూ.873 కోట్లున్నా మూడేళ్లలో రూ.194 కోట్లే ఖర్చు చేశారు” అని వివరించారు. 
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పిఎంకెఎస్‌వై) కింద మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు అందలేదని సిఆర్ పాటిల్ వెల్లడించారు. 99 ప్రాజెక్టుల్లో 71 పనులు చాలాకాలంగా నిలిచిపోయాయని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులను పిఎంకెఎస్‌వై కింద చేర్చడం జరిగిందని, వాటిలో అర్హత ఉన్న వాటికి కేంద్రం సహాయంగా రూ. 1,129.80 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ. 981.49 కోట్లను ఇప్పటివరకు కేంద్ర సహాయంగా అందించిందని ఆయన వెల్లడించారు.