తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు

తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు
* బిల్లును వ్యతిరేకించిన బిజెపి, బిఆర్ఎస్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’ను ప్రవేశపెట్టింది. గత సోమవారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందిన ఈ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా, శాసనసభ స్పీకర్ తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు. 

 
సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న విద్వేష పూరిత వ్యాఖ్యలను అరికట్టడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.  మతం, కులం, జాతి, లింగం, భాష లేదా నివాసం వంటి కారణాలతో విద్వేషం రేకెత్తించే వారికి ఈ చట్టం కింద కఠిన శిక్షలు ఖరారు చేశారు. విద్వేష ప్రసంగాలు లేదా పోస్టులు మొదటిసారి రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50,000 జరిమానా విధిస్తారు. అదే వ్యక్తి మళ్లీ నేరానికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 1,00,000 జరిమానా ఉంటుంది.

ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ప్రసంగాలే కాకుండా మాటల ముద్రణ, ప్రచురణ, సోషల్ మీడియా పోస్టులు, ఎలక్ట్రానిక్ సందేశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఏదైనా అసభ్యకర లేదా విద్వేష పూరిత కంటెంట్ ఉంటే, వాటిని వెంటనే తొలగించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించే అధికారం అధికారులకు ఉంటుంది. సంఘం, సమూహం లేదా బహిరంగ సమావేశాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి బిల్లును ఆమోదించింది.

కాగా, శాంతి భద్రత మీద మీరు తీసుకువచ్చే హెట్ స్పీచ్ బిల్లు మానవ హక్కుల ఉల్లంఘన లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.  ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు హెట్ స్పీచ్ బిల్లు అంటూ ఈ బిల్లు అత్యంత ప్రమాదకరం అని,  బిల్లులో అస్పష్ట మైన విషయాలు ఉన్నాయని తెలిపారు.  రాజ్యంగ స్ఫూర్తి కి విరుద్దంగా ఉన్న ఈ బిల్లును బిజెపి పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. 

సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తే కక్ష కట్టే విధంగా ఉందని చెబుతూ   కేవలం మతాలకు సంబంధించి కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛ హరించేందుకు ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన నిజాం, ఇందిరా గాంధీ గురించి మాట్లాడినా అరెస్ట్ చేసి జైల్లో పెడుతారని ఆందోళన వ్యక్తం చేశారు.   ఆధారాలు లేకున్న అరెస్ట్ చేసేలా బిల్లు ఉందని, నేరం రుజువు కాకముందు జైల్లో పెట్టేలా బిల్లు ఉందని చెప్పారు.

సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యం కు డెత్ వారెంట్ అంటూ రాజకీయ కక్షసాధింపు కోసమే ఈ బిల్లు అని స్పష్టం చేశారు.  ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక ‘క్రూరమైన ఆయుధం’గా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. 

ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. ‘అమలు యంత్రాంగం ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.