4, 5 తేదీల్లో భాగ్యనగరంలో ‘మాతృ సంస్కార్ సమాగమ్’

4, 5 తేదీల్లో భాగ్యనగరంలో ‘మాతృ సంస్కార్ సమాగమ్’
విశ్వమంగళ్య సభ (విఎంఎస్) ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ 4, 5 తేదీలలో భాగ్యనగరంలో “మాతృ సంస్కార్ సమాగమ్” పేరిట రెండు రోజుల రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహిస్తు న్నారు.మాతృత్వంలోని సహజ సిద్ధమైన శక్తిని మేల్కొల్పడం, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేయడం ద్వారా విలువలతో కూడిన ‘నవ భారత’ నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయడం ఈ సమ్మేళన ప్రధాన ఉద్దేశ్యం.

2010లో స్థాపించిన విశ్వమంగళ్య సభ సంస్కార్ (విలువలు), సామర్థ్య (శక్తి), సదాచారం (మంచి ప్రవర్తన),   సేవ అనే నాలుగు సూత్రాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా పనిచేస్తుందని ఉపాధ్యక్షురాలు శ్రీమతి పూజా నరేడి తెలిపారు. భవిష్యత్ తరాలకు జీవన విలువలను అందిస్తూ సంస్కృతిని కాపాడే కీలక బాధ్యత తల్లులపైనే ఉందని సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి బి. శృతి పేర్కొన్నారు. 

మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా దేశ నిర్మాణ శక్తిగా గుర్తించేలా సమాజాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కోఆర్డినేటర్ శ్రీమతి వరుణి రెడ్డి వివరించారు. సంఘటన్ మంత్రి గాయత్రీ లోహకరే ఈ సమ్మేళన షెడ్యూల్‌ను వివరిస్తూ ఆధ్యాత్మిక చింతన, సామాజిక అభివృద్ధి, మహిళల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే వివిధ చర్చా  గోష్టి , ఉపన్యాసాలు ఈ రెండు రోజులు ఉంటాయని తెలిపారు.
కుటుంబ, సామాజిక బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇదొక చక్కని వేదిక అని, రాష్ట్రంలోని మహిళలు, ముఖ్యంగా తల్లులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సహ కోఆర్డినేటర్ శ్రీమతి నందావతి భోసలే పిలుపునిచ్చారు.  ​విశ్వమంగళ్య సభ భారతీయ సంస్కృతి, నైతిక విలువల ఆధారంగా సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్న అంతర్జాతీయ సంస్థ. ‘మాతృ శక్తి’ని బలోపేతం చేయడం ద్వారా భారతదేశాన్ని తిరిగి ‘విశ్వగురు’ స్థానంలో నిలబెట్టడమే ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. వివరాలను మొబైల్:  7972059535 ద్వారా పొందవచ్చు.