ట్రంప్ బహిరంగంగా శాంతి చర్చలకు సిద్ధం అంటూనే, రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తున్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తమ దళాలు వారి రాక కోసం ఎదురుచూస్తున్నాయని, అమెరికా దళాలు ఇరాన్లో అడుగుపెట్టగానే, వాటిని బూడిద చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అమెరికాకు సహకరించే, దాని ప్రాంతీయ మిత్ర దేశాలను కూడా దండిస్తామని తేల్చిచెప్పారు.
తమ దీవుల్ని, నేలను ఆక్రమించాలని చూస్తే అమెరికన్ సైనికులంతా అక్కడి పర్షియన్ గల్ఫ్ షార్కులకు ఆహారంగా మారడం ఖాయమని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ సైనిక ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఎబ్రహిమ్ జోల్ఫాకరి మాట్లాడిన వీడియోను ఆర్మీ పోస్టు చేసింది. ట్రంప్‌నకు ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయనపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఒత్తిడి తెస్తోందని, దీంతో ట్రంప్ దాడులు చేయిస్తున్నాడని ఎబ్రహిమ్ ఆరోపించాడు. ఇజ్రాయెల్‌కు ట్రంప్ తన దేశాన్ని తాకట్టుపెట్టాడని, మొసౌద్ అనే తీవ్రవాద సంస్థ ఒత్తిడికి ట్రంప్ తలొగ్గాడని ఆరోపించాడు.
మరోవైపు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతేమ్ మొహజిరానీ కూడా శాంతి చర్చలపై స్పందిస్తూ వాస్తవానికి తాము యుద్ధం మొదలుపెట్టలేదని, కానీ తామ దేశం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. అందువల్ల శాంతి చర్చల్లో కచ్చితంగా ఇరాన్ నష్టపోయిన దానికి తగిన పరిహారం గురించి మాట్లాడాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఇక హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ, ఆంక్షల తొలగింపు వంటివి కూడా చర్చల్లో కీలక అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే తాము సుస్థిర శాంతి కోసం అడుగులు వేస్తామని చెప్పారు.
ఇక, ఇప్పటికే అమెరికన్ దళాలు నౌకలో పశ్చిమాసియా చేరుకున్నాయి. మొత్తం 3,500 ట్రూపుల్లో 2,500 మెరైన్లు ఉన్నారు. అధునాతన యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి ద్వారా సైనికులు గల్ఫ్ తీరానికి చేరుకున్నారు. గడిచిన 20 ఏళ్లలో ఈ ప్రాంతంలో అమెరికా ఈ స్థాయిలో దళాలను మోహరించడం ఇదే మొదటిసారి. ఇప్పుడు వైమానిక దాడులకే పరిమితమైన యుద్ధం అమెరికన్ దళాలు బరిలోకి దిగితే భూతల యుద్ధంగా మారుతుంది. ఇదే జరిగితే యుద్ధం మరింత ముదురుతుంది.
సైనికుల మోహరింపును యూఎస్ సెంట్రల్ కమాండ్ నిర్ధారించింది. కాగా, 844 అడుగుల పొడవుండే ట్రిపోలి నౌక 20 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది. 44 వేల టన్నుల బరువును మోసుకుపోగల ఈ నౌక ఒకే సమయంలో 20 ఎఫ్-358 స్టెల్త్ ఫైటర్లు, ఎంవీ-22 ఆస్ప్రే విమానాలు, హెలికాప్టర్లను మోసుకుపోగలదు. కాగా, ఇరాన్‌పై భూతల దాడికి పెంటగాన్ కొన్ని వారాల నుంచి సిద్ధమవుతున్నదని, అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

More Stories
జర్మనీ గురుద్వారాలో ఘర్షణ..11 మందికి తీవ్ర గాయాలు
అమెరికా, ఇరాన్ రెండో దశ చర్చలపై అనిశ్చితి
దళితులకు నేపాల్ ప్రభుత్వం పక్షం రోజుల్లో `క్షమాపణలు’