రామగుండంలో రానున్న ఎన్టీపీసీ ప్లాంట్ విద్యుత్ కొనాలి!

రామగుండంలో రానున్న ఎన్టీపీసీ ప్లాంట్ విద్యుత్ కొనాలి!
రెండో దశలో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవాలని, పూర్తి 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛను ఇవ్వాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ ఆయనకు ఓ లేఖ వ్రాసారు. రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయవలసిన 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశలో  భాగంగా 3X800=2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందని తెలిపారు. 

మొదటి దశలో లాగే రెండవ దశలో కూడా ఉత్పత్తి చేసే విద్యుత్ లో 85% విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందని ఆయన స్పష్టం చేశారు.  3 మార్చి, 2026 న తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని,  రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుందని తెలిపారు. 

తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకునే ప్రయత్నాలలో భాగంగా ఇటీవల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క “జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి” అని తెలియజేశారని గుర్తు చేశారు. 
 
అంతేకాకుండా, 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసిందని కిషన్ రెడ్డి తెలిపారు.
 
అందుచేత పూర్తి ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే, థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో తక్కువ ధరకే విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుండటంతో ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి, అవసరమైన ఒప్పందాలు(పిపిఏలు) చేసుకుంటున్నారని చెప్పారు.